శిశువుకు సర్కారు పునర్జన్మ 

11 Mar, 2022 02:56 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి

ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందుకు ఆపన్న హస్తం 

చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం భరించేందుకు ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, అమరావతి :  ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ పసికందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పునర్జన్మ ప్రసాదించింది. బిడ్డకు మెరుగైన చికిత్స అందించే స్తోమత లేని తల్లిదండ్రులకు ఆపన్న హస్తం అందించింది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం బేతపూడికి చెందిన బడుగు రవికుమార్‌ ఇదే మండలం పేటేరు గ్రామంలో గ్రామ సచివాలయ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. రవికుమార్‌ భార్య జయలక్ష్మి నెలన్నర క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. 1.50 కిలోల తక్కువ బరువుతో శిశువు పుట్టడంతో పలు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో రేపల్లెలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొద్దిరోజులు చికిత్స అందించారు.

మంగళవారం శిశువులో ఎలాంటి చలనం లేకపోవడంతో వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి.. చికిత్సకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం భరించే స్తోమత రవికి లేదు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం సూచన మేరకు శిశువు చికిత్సకు ఫండ్‌ రైజింగ్‌ చేశారు. ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా మంత్రి ఆళ్ల నాని దృష్టికెళ్లింది. వెంటనే ఆయన ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా వైద్యానికి నిధులు మంజూరయ్యేలా చూడాలని అధికారులకూ సూచించారు.  

ప్రభుత్వం మేలు మరువలేం 
చికిత్స కోసం డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న నాకు మంత్రి ఆళ్ల నాని పీఏ ఫోన్‌ చేసి వివరాలు తీసుకున్నారు. కొద్దిసేపటికి మంత్రి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. ప్రభుత్వమే చికిత్స మొత్తం చూసుకుంటుందని భరోసా ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మేలు జన్మలో మరువలేం. 
    – బడుగు రవికుమార్, శిశువు తండ్రి   

మరిన్ని వార్తలు