గిరిజన సంక్షేమంలో ఏపీ భేష్‌ 

10 Aug, 2021 03:02 IST|Sakshi
గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ ప్రశంసలు

గిరిజన  హక్కుల రక్షణకు ప్రాధాన్యం: మంత్రి పుష్ప శ్రీవాణి 

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కూడా గిరిజనులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అభినందనీయమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ నావల్‌జిత్‌ కపూర్‌ పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో సోమవారం కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలు, ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన–శిక్షణ మిషన్, సెంటర్‌ రీజనల్‌ స్టడీస్‌ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. వర్చువల్‌ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్న నావల్‌జిత్‌ కపూర్‌ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు తదితర మౌలిక వసతులను కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏపీలో గిరిజన ఉప ప్రణాళిక అమలుకు సహకారం అందిస్తామన్నారు. 

ఉప ప్రణాళిక అమలులో ముందున్నాం.. 
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజన ఉప ప్రణాళిక అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందుందని చెప్పారు. నవరత్నాలతో పాటు పలు సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల జీవితాల్లో సీఎం జగన్‌ కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, హక్కుల రక్షణలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్‌ దండే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులకు 2వ దఫా పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్‌బాషా, గిరిజన సంక్షేమ శాఖ మిషన్‌ సంచాలకుడు రవీంద్రబాబు, డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

థింసా నృత్యం చేసిన మంత్రి పుష్పశ్రీవాణి
సీతానగరం(పార్వతీపురం)/కురుపాం/ పాడేరు:  విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. స్థానిక గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, ఎమ్మెల్సీ రఘువర్మ, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.  

పాడేరులో ఘనంగా: విశాఖ ఏజెన్సీలోని పాడేరులో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో  ఎంపీ గొడ్డేటి మాధవి, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, కలెక్టర్‌ మల్లికార్జున, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ నర్సింగరావు, రాష్ట్ర ట్రైకార్‌ చైర్మన్‌ బుల్లిబాబు, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు