Andhra Pradesh: చేతల్లో.. సామాజిక న్యాయం 

5 Sep, 2021 02:32 IST|Sakshi

47 కార్పొరేషన్లకు 481 మందిని డైరెక్టర్లుగా నియమించిన ప్రభుత్వం

వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు 58 శాతం 

మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవుల్లోనూ అధిక శాతం వీరే

నామినేటెడ్‌ పదవులు, ‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ’ల్లోనూ వీరికే సింహభాగం  

2019 సాధారణ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో 60% ఈ వర్గాలకే 

తద్వారా సామాజిక రాజకీయ విప్లవానికి నాంది

పరిపాలనలో భాగస్వామ్యం ద్వారా అట్టడుగు వర్గాలకు ‘నవరత్నాల’ ఫలాలు.. తద్వారా పేదరికం నుంచి విముక్తి పొందే అవకాశం

ఇది సామాజికాభివృద్ధికి, మహిళా సాధికారతకు బాటలు వేస్తుందంటోన్న సామాజికవేత్తలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 47 కార్పొరేషన్ల డైరెక్టర్లుగా సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని, మహిళలను నియమించడం ద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి దేశానికి చాటి చెప్పారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో సంక్షేమ పథకాల అమలే కాకుండా, పదవుల పంపకంలోనూ ఆ వర్గాల ప్రజలకే అధిక శాతం కేటాయిస్తుండటాన్ని వారు ఉదహరిస్తున్నారు. దీని వల్ల అట్టడుగు వర్గాల వారికీ సంక్షేమ పథకాలు అందుతాయని.. తద్వారా సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. శనివారం 47 కార్పొరేషన్లలో 481 డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఇందులో 52 శాతం పదవులు అంటే 248 డైరెక్టర్ల పదవుల్లో మహిళలను నియమించింది. మిగిలిన 48 శాతం అంటే 233 డైరెక్టర్ల పదవుల్లో పురుషులకు అవకాశం కల్పించింది. డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని నియమించింది. మిగతా 48 శాతం ఓసీ వర్గం వారికి కేటాయించింది.  

సామాజిక రాజకీయ విప్లవానికి నాంది 
రాష్ట్రంలో 2019 సాధారణ ఎన్నికల్లోనే అధిక శాతం శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు టికెట్లు ఇచ్చి సామాజిక రాజకీయ విప్లవానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారు. ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన తర్వాత మంత్రి వర్గంలోనూ 60 శాతం పదవులను ఆ వర్గాలకు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయానికి సరి కొత్త నిర్వచనం చెప్పారు. ఆ తర్వాత నామినేటెడ్‌ పదవుల్లోనూ ఆ వర్గాల ప్రజలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకే అవకాశం కల్పించేలా ఏకంగా చట్టాన్ని తెచ్చారు. 

మాటలు కాదు.. చేతల్లో 
సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 137 నామినేటెడ్‌ పదవుల్లో 58 శాతం అంటే 79 పదవులు ఈ వర్గాల వారికే ఇచ్చారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళ సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు నలుగురు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున 15 ఎమ్మెల్సీ పదవుల్లో 11 పదవులను ఆ వర్గాల వారికే కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 60 శాతం టికెట్లు.. మున్సిపల్‌ చైర్‌ పర్సన్, మేయర్‌ పదవుల్లో 78 శాతం.. అందులో 60.46 శాతం పదవులు మహిళలకు ఇచ్చి రికార్డు సృష్టించారు. బీసీల కోసం ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాలన్నీ ‘నవరత్నాల’ సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాల ప్రజలకు చేరడానికి దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. తద్వారా ఆయా వర్గాల్లోని పేద ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుందని, ఇది సామాజికాభివృద్ధి.. మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని విశ్లేషిస్తున్నారు.   

మరిన్ని వార్తలు