ఆఖరి మజిలీపై అపోహలు

24 Jul, 2020 04:18 IST|Sakshi

కరోనా మహమ్మారితో కలచివేసే దృశ్యాలు

చనిపోయిన ఆరు గంటల తర్వాత వ్యాపించే ప్రమాదం లేదు.. బూడిదలోనూ వైరస్‌ ఉండదు

పోస్టుమార్టం లేనందున బాడీతో వ్యాప్తి జరగదు

అంత్యక్రియలపై భయాలు వద్దంటున్న వైద్యులు

సాక్షి, అమరావతి: అపోహలు.. భయాలతో మానవత్వం మంటగలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా చోటు చేసుకుంటున్న ఘటనలు హృదయాన్ని ద్రవింప చేస్తున్నాయి. సాటి మనిషికి తుది వీడ్కోలు పలికేందుకూ జంకుతుండటంతో ఆఖరి ప్రయాణం ఒంటరిగానే ముగుస్తోంది. మృతదేహాల నుంచి వైరస్‌ వ్యాప్తి ఉండదని పదే పదే చెబుతున్నా భయంతో వెనుకంజ వేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై కనీస అవగాహన లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. 
ఒక్క కేసూ లేదు: కుటుంబీకులు, బంధువులు ముందుకు రాకపోవడంతో కరోనాతో మృత్యువాత పడ్డ వారి దహన సంస్కారాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన వారిలో ఏ ఒక్క మృతదేహం నుంచీ కరోనా కేసులు నమోదైన దాఖలాలు లేవు. కరోనా మృతుల అంత్యక్రియల కోసం రూ.15 వేలు చొప్పున ప్రకటించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.

స్నానం చేయించడం, హత్తుకోవడం వద్దు..
► కరోనాతో చనిపోయిన వారి నుంచి వైరస్‌ సోకే అవకాశం లేదు. మృతి చెందిన 6 గంటల తర్వాత ద్రవాలు ఊరడం ఉండదు. ఉచ్ఛాశ్వ నిశ్వాసలు ఉండవు కాబట్టి ఇతరులకు సోకే అవకాశం లేదు. 
► కాకపోతే మృతదేహానికి సంప్రదాయాల ప్రకారం స్నానం చేయించడం, హత్తుకోవడం లాంటివి చేయకూడదు.
► పీపీఈ కిట్లు, చేతికి గ్లౌజులు ధరించి తగినంత మంది అంత్యక్రియల్లో పాల్గొనవచ్చు.
► శవాన్ని దహనం చేశాక బూడిదలో ఎలాంటి వైరస్‌ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెవో) స్పష్టం చేసింది.
► కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు ఎలాంటి పోస్టుమార్టం చేయడం లేదు కాబట్టి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం లేదు. శవాన్ని భద్రపరిచే సమయంలోనే నోరు, ముక్కు, చెవులు నుంచి ద్రవాలు ఊరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 
► కరోనా పాజిటివ్‌ మృతుల శరీరం నుంచి ఊరిన ద్రవాలను తాకినప్పుడు మాత్రమే వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎగ్జామినర్స్‌ సంస్థ పేర్కొంది.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు...
► డెడ్‌బాడీని తరలించే వ్యక్తులు గ్లౌజులు, పీపీఈ కిట్‌లు వాడాలి.
► కాన్యులాలు, సెలైన్‌ పైపులు తొలగించాలి.
► ఆస్పత్రినుంచి బాడీని ప్రత్యేకంగా శానిటైజ్‌ చేసి జిప్‌ కలిగిన బ్యాగులో తరలించాలి.
► హైపో క్లోరైడ్‌ సోడియం (1 పర్సెంట్‌) ద్రావణంతో శుద్ధి చేయాలి
► పూడ్చిపెట్టినప్పుడు గుంత ఆరడుగులకు తక్కువ కాకుండా చూడాలి.
► శవాన్ని తరలించిన వారు పీపీఈ కిట్లను అక్కడే తొలగించి బయో వ్యర్థాలుగా నిర్వీర్యం చేయాలి.
► దహనంలో జాప్యం జరిగితే బాడీని 4 డిగ్రీల సెల్సియస్‌లో భద్రపరచాలి.

కేసులు పెరుగుతాయనే...
‘కరోనా మృతుల అంత్యక్రియల్లో భౌతిక దూరం పాటించకుండా ఎక్కువ మంది గుమిగుడితే వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తోంది. కొన్నిచోట్ల అపోహలతో అడ్డుకుంటున్నారు. జిప్‌ చేసిన బ్యాగులో ఉంటుంది కాబట్టి శవం నుంచి ఎలాంటి వ్యాప్తి జరగదు. మృతిచెందిన ఆరు గంటల తర్వాత ఎలాంటి వ్యాప్తి ఉండదు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి’ –డా.కె.ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు

వస్తువును శానిటైజ్‌ చేస్తే ఎలాగో..
‘సెల్‌ఫోన్‌ లేదా వాటర్‌ బాటిల్‌ తదితరాలపై శానిటైజ్‌ చేస్తే వైరస్‌ ఎలా పోతుందో కరోనా మృతదేహాలు కూడా అంతే. పూర్తిగా సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రం చేస్తారు. పోస్ట్‌మార్టం చేయకుండా బాడీని తెస్తే కరోనా వ్యాపించదు. ఈ వాస్తవాన్ని గ్రహించాలి’ –డా.సుబ్బారావు, ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులు, ఒంగోలు

శ్వాసతోనే వైరస్‌ వ్యాప్తి
‘శ్వాస ప్రక్రియ ఉంటేనే ఈ వైరస్‌ వ్యాప్తి ఉంటుంది. డెడ్‌బాడీ నుంచి వైరస్‌ వ్యాప్తి చాలా తక్కువ. ప్రజలు భయాందోళన నుంచి బయటకు రావాలి. అంత్యక్రియలను అడ్డుకోవడం మంచిది కాదు’ –డా.నీలిమ, కమ్యూనిటీ మెడిసిన్‌ నిపుణులు, వైద్యవిద్యాశాఖ

మరిన్ని వార్తలు