తెలంగాణకు జరిమానా విధించండి

23 Sep, 2021 04:03 IST|Sakshi

అనుమతి లేకుండా శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తికి వాడుకున్న 113.57 టీఎంసీలను తెలంగాణ వాటా కిందే లెక్కించండి

సాగర్, పులిచింతల్లో తెలంగాణ ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో 50 శాతం ఏపీకి కేటాయించండి

తెలంగాణ సర్కారుపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరండి

కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ

సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు 14వ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండటాన్ని ఏపీ ప్రభుత్వం మరోసారి కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. విభజన చట్టాన్ని, బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును, కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణపై నిబంధనల మేరకు జరిమానా విధించాలని విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టులు పొంగిపొర్లుతూ ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు తప్ప.. మిగిలిన రోజుల్లో ఎలాంటి అనుమతి తీసుకోకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా తెలంగాణ సర్కారు అక్రమంగా వాడుకున్న 113.57 టీఎంసీలను ఆ రాష్ట్ర వాటా 299 టీఎంసీల కింద లెక్కించాలని పునరుద్ఘాటించింది.

సాగర్‌ నుంచి 86.60, పులిచింతల నుంచి 23.63 వెరసి 110.23 టీఎంసీలను అక్రమంగా వాడుకుని తెలంగాణ ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో 50 శాతాన్ని ఏపీకి కేటాయించాలని కోరింది. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ భేఖాతరు చేస్తున్న నేపథ్యంలో విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌ ప్రకారం జోక్యం చేసుకుని విద్యుత్‌ ఉత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్‌ కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై చర్చించడానికి అత్యవసరంగా కృష్ణా బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం లేఖ రాశారు. 

లేఖలో ప్రధానాంశాలివీ..
► దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టులో ఇరు రాష్ట్రాలు వాటికి కేటాయించిన నీటిని వాడుకుంటూ విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని బోర్డు 14వ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కానీ.. తెలంగాణ సర్కారు అందుకు విరుద్ధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల శ్రీశైలంలో నీటిమట్టం పడిపోతోంది.
► బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని విభజన చట్టం పేర్కొంది. ఈ ట్రిబ్యునల్‌ తీర్పే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పులో 148 పేజీలో పేర్కొన్న మేరకు దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేయాలి. విభజన చట్టంలో సెక్షన్‌–85(8) కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా బోర్డు, కేంద్రం ఆదేశాలను ధిక్కరిస్తే సంబంధిత రాష్ట్రంలో జరిమానా విధించాలని విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌లో తొమ్మిదో పేరాలో స్పష్టంగా ఉంది. 
► కృష్ణా బోర్డు 14వ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా.. సాగర్‌లో 311.15 టీఎంసీలు నిల్వ ఉన్నప్పటికీ దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా తెలంగాణ సర్కారు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల భారీ ఎత్తున జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయి. కేంద్రం, కృష్ణా బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తున్న తెలంగాణ సర్కారుకు జరిమానా విధించండి. 

మరిన్ని వార్తలు