శనగ విత్తనం సిద్ధం

3 Oct, 2021 04:05 IST|Sakshi

రబీ కోసం 2.32 లక్షల క్వింటాళ్ల విత్తనం 

ఐదెకరాల్లోపు రైతులకు 25 శాతం సబ్సిడీపై పంపిణీ 

నేటినుంచి ఆర్‌బీకేల్లో రైతుల వివరాల నమోదు 

సాక్షి, అమరావతి: రబీలో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట శనగ. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 56 లక్షల ఎకరాలు కాగా.. దాంట్లో 11.50 లక్షల ఎకరాల్లో శనగ సాగవుతుంది. 90 శాతానికి పైగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే ఈ పంట వేస్తారు. ఈ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాల్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  

నాణ్యత పరీక్షించి మరీ.. 
ఆర్‌బీకేల ద్వారా 2,32,577 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న వర జేజీ–11 రకం విత్తనం 2,16,880 క్వింటాళ్లు, వర కేఏకే–2 విత్తనం 15,697 క్వింటాళ్లను సిద్ధం చేశారు. సబ్సిడీ పోగా క్వింటాల్‌ ధర వర జేజీ–11 విత్తనం మొదటి రకం (ïసీ/ఎస్‌) ధర రూ.5,250, రెండో రకం (టీ/ఎల్‌) క్వింటా రూ.5175, వర కేఏకే–1 మొదటి రకం (సీ/ఎస్‌) రూ.6,660, రెండో రకం (టీ/ఎల్‌) రూ.6,585లుగా నిర్ణయించారు. ఎకరంలోపు భూమిగల రైతుకు బస్తా (25 కేజీలు), ఆ తర్వాత ఎకరానికి ఒకటి చొప్పున ఐదెకరాల్లోపు రైతులకు ఐదు బస్తాల చొప్పున విత్తనాలు పంపిణీ చేస్తారు. సేకరించిన విత్తనాల నాణ్యతను పరీక్షించి ధ్రువీకరించిన అనంతరమే రైతులకు అందజేస్తారు. 

పంట వేయకపోతే ‘భరోసా’కు అనర్హులు 
శనగ విత్తనం కోసం ఆర్‌బీకేల్లో ఈ నెల 3వ తేదీన అనంతపురం, 4న వైఎస్సార్, కర్నూలు, 5న ప్రకాశం, 10న కృష్ణా, 15న నెల్లూరు, అక్టోబర్‌ చివరి వారంలో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో రైతుల వివరాల నమోదుకు శ్రీకారం చుడతారు. డి.క్రిష్‌ యాప్‌ ద్వారా ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు, కౌలు రైతులను వ్యవసాయ సహాయకులు గుర్తిస్తారు. వారికి కావాల్సిన విత్తనం కోసం సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో కట్టించుకుంటారు. ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ పద్ధతి ద్వారా ఈ నెల 4 నుంచి విత్తన పంపిణీకి శ్రీకారం చుడతారు. సబ్సిడీపై విత్తనం పొందిన రైతు సాగు చేసిన పంట వివరాలను విధిగా ఈ క్రాప్‌లో నమోదు చేయాలి. ఒక వేళ విత్తనం తీసుకుని పంట వేయకపోతే ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ వంటి ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తారు.  

పకడ్బందీగా విత్తన పంపిణీ 
రానున్న రబీ సీజన్‌లో సొంతంగా అభివృద్ధి చేసిన శనగ విత్తనాన్ని సబ్సిడీపై ఆర్‌బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు నాణ్యత ధ్రువీకరించిన విత్తనం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. 
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి  

మరిన్ని వార్తలు