అందరికీ ఆరోగ్య పరీక్షలు

1 Jun, 2022 05:22 IST|Sakshi

జీవన శైలి జబ్బుల కట్టడికి ప్రభుత్వం చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కొనసాగుతున్న స్క్రీనింగ్‌ 

ఇప్పటివరకు 2.67 కోట్ల మందికి పూర్తి 

సాక్షి, అమరావతి: మారుతున్న ఆహార అలవాట్లతో 40 ఏళ్లు నిండకుండానే జీవనశైలి జబ్బులు చుట్టుముడుతున్నాయి. వ్యాధి ముదిరిపోయే వరకు గుర్తించకపోవడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముప్పుగా పరిణమించిన అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ) సహా పలు రకాల  స్క్రీనింగ్‌ పరీక్షలను ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి చేపడుతున్నారు. 

సగానికిపైగా స్క్రీనింగ్‌ పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా 4,66,67,774 మందికి స్క్రీనింగ్‌ చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 2,67,69,033 మందికి పూర్తయ్యింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 74.48% అనకాపల్లిలో 67.24%, నంద్యాలలో 66.72 శాతం జనాభాకు స్క్రీనింగ్‌ చేశారు.

బీపీలో కోనసీమ టాప్‌
ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలో 11,92,104 మంది రక్తపోటుతో బాధ పడుతున్నట్టు గుర్తించారు. 8,93,904 మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 99,376 మంది బీపీ బాధితులున్నారు. పశ్చిమ గోదావరిలో 81,072, ఏలూరులో 77,048, కాకినాడలో 75,640 మందికి హైపర్‌టెన్షన్‌ ఉన్నట్టు వెల్లడైంది. మధుమేహం బా«ధితులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 65,772 మంది ఉన్నారు. కోనసీమలో 63,012, కృష్ణాలో 61,935 మంది షుగర్‌తో బాధపడుతున్నారు.

స్క్రీనింగ్‌ వివరాలతో ఐడీలు
ఎన్‌సీడీ సర్వేలో గుర్తించిన అసాంక్రమిక వ్యా«ధుల బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీరి కోసం పీహెచ్‌సీల్లో ఎన్‌సీడీ క్లినిక్‌లను సైతం వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌తో పాటు ప్రజలకు డిజిటల్‌ ఆరోగ్య ఐడీని ఆరోగ్య కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. స్క్రీనింగ్‌లో వెల్లడైన ఆరోగ్య వివరాలను ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నమోదు చేయగానే సంబంధిత వ్యక్తి ఆరోగ్య చరిత్ర అంతా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఆరోగ్య చరిత్రను పరిగణలోకి తీసుకుని వైద్యులు వేగంగా సరైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు