AP Tourism: మనోహరం.. నదీ విహారం 

23 Dec, 2021 03:49 IST|Sakshi

జల పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు 

పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక బోట్ల సంఖ్య పెంపు 

ప్రస్తుతం పాపికొండలుకు 45 మంది సామర్ధ్యంతో బోట్లు 

త్వరలో 95 మంది సామర్థ్యంతో మరో హరిత బోటు 

పోచవరం నుంచి భద్రాచలానికి బోటు నడిపేందుకు సన్నాహాలు 

త్వరలో అందుబాటులోకి సంతశ్ర, బోధిశ్రీ, హరిత బోట్లు 

పాపికొండలుకు ప్రత్యేక నైట్‌ ప్యాకేజీలు 

సాక్షి, అమరావతి: గోదావరిలో పాపికొండల సోయగాలు.. గోదావరి ఇసుక తిన్నెల్లో వెన్నెల రాత్రులు.. పోచవరం నుంచి భద్రాచలానికి హాయిహాయిగా ప్రయాణం.. కృష్ణా నదిలో భవానీ ద్వీపంలో ఆట పాటలు.. నాగార్జున సాగర్‌లో చల్ల గాలుల మధ్య విహారం.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల మధ్య ప్రపంచాన్ని మరిచి ప్రయాణం చేస్తారా.. అందుకు మీరు సిద్ధమేనా అంటోంది రాష్ట్ర పర్యాటక శాఖ. రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆధునిక బోట్లను అందుబాటులోకి తెస్తోంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటుండంతో డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక బోట్ల సంఖ్యను పెంచుతోంది.

నిలిచిపోయిన బోట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతోంది. ప్రస్తుతం పాపికొండలకు వారాంతంలో 45 మంది ప్రయాణికుల సామర్థ్యంతో పర్యాటక శాఖ బోటు నడుపుతుండగా 95 మంది సామర్థ్యంతో మరో హరిత బోటును అందుబాటులోకి తేనుంది. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటును తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సాగర్‌–శ్రీశైలం ప్రయాణానికి సంతశ్రీ బోటును రూ.35 లక్షలతో మరమ్మతులు చేపట్టి సంక్రాంతి నాటికి తీసుకురానుంది. చాలా కాలం తర్వాత విజయవాడలోని భవానీ ద్వీపంలో బోధిశ్రీ బోటు సేవలకు సిద్ధమైంది.

రాబడి పెంచుకునేందుకు యత్నాలు
ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాపికొండలకు నిత్యం రెండు బోట్లు (ప్రైవేటు) తిరుగుతున్నాయి. వారాంతాల్లో పర్యాటక శాఖ బోట్లతో కలిపి ఐదు సేవలందిస్తున్నాయి. సగటున రోజుకు 300 మంది ప్రయాణిస్తున్నారు. భవానీ ద్వీపంలో బోటింగ్‌ ద్వారా రోజుకు సగటున రూ.40 వేలు, వారాంతాల్లో రూ.2.50 లక్షల ఆదాయం వస్తుండటం విశేషం. ఇక్కడ వారాంతంలో సుమారు 1,500 మంది బోట్లలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 12 ప్రదేశాల్లో పర్యాటక శాఖకు చెందిన 48 బోట్లు, వందకు పైగా ప్రైవేటు బోట్లు సేవలందిస్తున్నాయి. గతంలో కేవలం బోటింగ్‌ ద్వారా రూ.7 కోట్లకు పైగా ఆదాయం రాగా ప్రస్తుతం అది రూ.కోటికి పడిపోయింది. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు సమయం ఉండటంతో రాబడి పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

పాపికొండల నైట్‌ ప్యాకేజీలు ఇలా..
పర్యాటక శాఖ పాపికొండలకు రెండు రోజుల (నైట్‌) ప్యాకేజీలను అందిస్తోంది. గండిపోచమ్మ – పేరంటాళ్లపల్లి ప్రయాణానికి చార్జి సాధారణ రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) పెద్దలకు రూ.3,200, పిల్లలకు 2,300, వారాంతాల్లో (శుక్రవారం నుంచి ఆదివారం) పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,500గా నిర్ణయించారు. రాజమండ్రి–గండిపోచమ్మ– పేరంటాళ్లపల్లి  ప్యాకేజీలో సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.3,000, వారాంతాల్లో పెద్దలకు రూ.4,300, పిల్లలకు రూ.3,300 టికెట్‌ ధర ఖరారు చేశారు. ఇందులో రాజమండ్రి నుంచి పర్యాటక శాఖ బస్సులో ప్రయాణికులను బోటింగ్‌ పాయింట్‌కు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రయాణం మొదలై మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ముగుస్తుంది. పేరంటాళ్లపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో కొల్లూరు, కొరుటూరులోని గిరిజన సంప్రదాయ తరహా బ్యాంబూ హట్స్‌లో (వెదురుతో చేసిన గుడిసెలు) రాత్రి బసను ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు ఆటవిడుపుగా వాలీబాల్, కబడ్డీ, ట్రెక్కింగ్, జంగిల్‌ వాక్‌ సౌకర్యాలను మెరుగుపరిచారు.

బోట్ల సంఖ్యను పెంచుతున్నాం
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక కారణాలతో బోట్లు చాలా కాలంపాటు నిలిచిపోయాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు మరమ్మతులు చేయిస్తున్నాం. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటు తిప్పేందుకు ఆలోచిస్తున్నాం. పోలవరానికి ప్రత్యేక నైట్‌ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాం. 
– ఎస్‌.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం కార్పొరేషన్‌

రాబడి పెంపుపై దృష్టి
రాష్ట్రంలో జల పర్యాటకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా బోట్ల సంఖ్యను పెంచి రాబడి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బోట్లకు మరమ్మతులు చేపడుతున్నాం. త్వరలోనే పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని వాటిని నీటిలోకి ప్రవేశపెడతాం.
– ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ 

మరిన్ని వార్తలు