ఇక ఎప్పటిలానే ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు

21 Jul, 2021 02:30 IST|Sakshi

రెండో శనివారం, ఆదివారం సెలవు 

కోవిడ్‌ కేసులు తగ్గిన నేపథ్యంలో నిర్ణయం 

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ తక్షణమే అమల్లోకి.. 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక రెగ్యులర్‌గా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తక్షణమే ఈ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కార్యాలయాలు, ఉప కార్యాలయాలు, జిల్లా నియంత్రణలో ఉండే కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యాలయాలకు ప్రతి ఆదివారంతో పాటు రెండో శనివారం సెలవు ఉంటుందని తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయిలో సచివాలయంతో పాటు శాఖాధిపతులు కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చిన ఇన్‌స్టిట్యూషన్స్‌ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలవరకు పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యాలయాలకు వారంలో ఐదు రోజులు పనిదినాల్లో భాగంగా 27–06–2021 నుంచి ఏడాది పాటు ప్రతి శని, ఆదివారాలు సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. రెగ్యులర్‌ పనివేళలను తప్పనసరిగా పాటించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు