మరో 2 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు

9 Jul, 2021 02:14 IST|Sakshi

రాజమహేంద్రవరంలో ఫర్నిచర్‌ క్లస్టర్‌

ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి

నెల్లూరు జిల్లాలో గార్మెంట్‌ క్లస్టర్‌.. 7,000 మందికి ఉపాధి

రెండు క్లస్టర్ల ద్వారా కనీసం 10 ఎగుమతి ఆధారిత యూనిట్లు

రెండేళ్లలో అందుబాటులోకి తేనున్న ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ 

సాక్షి, అమరావతి: అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాజమహేంద్రవరంలో ఫర్నిచర్, నెల్లూరులో గార్మెంట్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తూ చిన్న పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఈ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ సీఈవో పవనమూర్తి ‘సాక్షి’కి వెల్లడించారు. సుమారు రూ.14.98 కోట్లతో రాజమహేంద్రవరం వద్ద ఫర్నిచర్‌ క్లస్టర్, నెల్లూరు వద్ద రూ.8.23 కోట్లతో గార్మెంట్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. క్లస్టర్‌ అభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ 10 % పెట్టుబడి పెడితే కేంద్రం 70 %, రాష్ట్రం 20 % నిధులను కేటాయిస్తుందన్నారు. 

వేలాది మందికి ఉపాధి
రాజమహేంద్రవరం క్లస్టర్‌ పరిధిలో ఫర్నిచర్, డిజైనింగ్‌కు సంబంధించి 160 యూనిట్ల ద్వారా ఏటా రూ.60 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ అంచనా వేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రెండేళ్లలో వ్యాపార పరిమాణాన్ని రూ.90 కోట్లకు పెంచడంతో పాటు అదనంగా 1,000 మంది వరకు ప్రత్యక్షంగా, 4,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. సాధారణంగా ఒక చెట్టును కొట్టిన తర్వాత కలపను ఎండబెట్టి ఫర్నిచర్‌గా మార్చేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది.

ఈ క్లస్టర్‌లో వుడ్‌ సీజనింగ్‌ మిషన్‌ టెక్నాలజీ అందుబాటులోకి తేవడం ద్వారా కలపను ఆరబెట్టడం ద్వారా వెంటనే ఫర్నిచర్‌ తయారీకి వినియోగించవచ్చు. అలాగే క్వాడ్‌కామ్‌ టెక్నాలజీతో కావాల్సిన డిజైన్లను వేగంగా తీర్చిదిద్దడంతో పాటు బొమ్మలు తయారీకి శాండింగ్, మౌల్డింగ్‌ టెక్నాలజీలను అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగడం ద్వారా లాభాలు 20 – 25 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. రెండేళ్లలో ఈ క్లస్టర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కనీసం నాలుగు నుంచి ఐదు ఎగుమతి ఆధారిత యూనిట్లను ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పవనమూర్తి తెలిపారు.

రెడీమేడ్‌ క్లస్టర్‌తో మహిళలకు ఉపాధి
నెల్లూరు జిల్లాలో పలువురు మహిళలు దీర్ఘకాలంగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి మెరుగైన ఆదాయం లభించేలా  సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు నెల్లూరు జిల్లా మహిళా ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ రెడేమేడ్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. ఎంబ్రాయిడరీ, జాబ్‌ వర్క్, రెడీమేడ్‌  గార్మెంట్‌కు సంబంధించి అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మల్టీ కలర్‌ కంప్యూటరైజ్డ్‌ ఎంబ్రాయిడరీ, 5/6 థ్రెడ్‌ వర్కింగ్, కంప్యూటరైజ్డ్‌ డిజైనింగ్‌లతోపాటు వీటిపై శిక్షణ ఇచ్చేందుకు స్కిల్‌ ట్రైనింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా గార్మెంట్‌ వ్యాపారం రూ.25 కోట్లు ఉండగా ఈ క్లస్టర్‌ రాకతో ఈ పరిమాణం రూ.40 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ క్లస్టర్‌ ద్వారా నేరుగా 1,500 మందికి, పరోక్షంగా 5,500 మందికి ఉపాధి లభించనుందని అంచనా. కనీసం ఐదు ఎగుమతి ఆథారిత కంపెనీలు వస్తాయని కార్పొరేషన్‌ అంచనా వేసింది.  ఇవి కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ప్రింటింగ్‌/ జీడిపప్పు క్లస్టర్‌ అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పవనమూర్తి తెలిపారు.  

మరిన్ని వార్తలు