వచ్చేస్తున్నాయి ‘మటన్‌ మార్ట్‌’లు

9 Sep, 2021 05:01 IST|Sakshi

ఆరోగ్యకరమైన మాంసం వినియోగం పెంచడమే లక్ష్యం

విశాఖ, విజయవాడల్లో నాలుగు చొప్పున ఏర్పాటు

మిగిలిన కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో కూడా

రూ.11.20 కోట్లతో 112 మార్ట్‌ల ఏర్పాటుకు సన్నాహాలు

పరిశుభ్రమైన వాతావరణంలో మటన్‌ రిటైల్‌ అవుట్‌లెట్స్‌

దశలవారీగా మిగిలిన ప్రాంతాలకు విస్తరించాలని యోచన

సాక్షి, అమరావతి: మాంసాహార ప్రియులకు శుభవార్త. అందుబాటు ధరల్లో ఆరోగ్యకరమైన మాంసాహారాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో మాంసం దుకాణాలు (మటన్‌ మార్టు) ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో నగరాలు, పట్టణాల్లో ఇవి ఏర్పాటవుతాయి. మలిదశలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వీటిని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. మేక మాంసం, గొర్రె మాంసం అంటే నోరూరని మాంసాహారులుండరు. తలకాయ మాంసం, కాళ్ల పులుసు, బోటీ కూర ఉంటే లొట్టలేసుకుని తింటారు. అనారోగ్యం అనంతరం వేగంగా కోలుకునేందుకు పెద్దల నుంచి వైద్యుల వరకు మటన్‌ తినమని ప్రోత్సహిస్తారు. నూటికి 85 శాతం మంది మాంస ప్రియులుంటే అందులో మటన్‌ ఇష్టపడే వారు 90 శాతానికిపైనే ఉంటారు. మాంసాహార ఉత్పత్తుల వినియోగంలో 13.53 శాతం మేక, గొర్రె మాంసానిదే. ధర ప్రియమైనా ఆదివారం వచ్చిందంటే కోడి మాంసం, చేపలు, రొయ్యలకు దీటుగా మటన్‌ విక్రయాలు జరుగుతుంటాయి. 2.31 కోట్ల మేకలు/గొర్రెల సంపద కలిగిన మన రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఎగుమతుల్లో కూడా టాప్‌–10లోనే ఉంది.

స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యం
ఏటా ఉత్పత్తిలో ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు సాధిస్తున్నప్పటికీ స్థానిక వినియోగం పెరగడం లేదు. దీనికి ప్రధాన కారణం ధర సామాన్యులకు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్యకరమైన వాతావరణంలో వధశాలలు, దుకాణాలు లేకపోవడమే. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ పోర్టబుల్‌ మాంసం ఉత్పత్తి, రిటైల్‌ సౌకర్యం (పీ – మార్ట్‌) అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్‌) అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రమాణాలకనుగుణంగా అత్యంత ఆరోగ్యకరమైన వాతావరణంలో మొబైల్‌ మటన్‌ దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి.

సబ్సిడీపై మంజూరు
ఏపీ మీట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో యూనిట్‌ రూ.10 లక్షల అంచనా వ్యయంతో తొలిదశలో మహానగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 112 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. విశాఖ, విజయవాడ నగరాల్లో నాలుగు, మిగిలిన కార్పొరేషన్ల పరిధిలో రెండు, ఇతర మునిసిపాల్టీల పరిధిలో ఒక్కటి చొప్పున సబ్సిడీతో కూడిన గ్రాంట్‌తో వీటిని ఏర్పాటు చేస్తారు. 

మటన్‌ మార్ట్‌ల్లో ఎన్నో ప్రత్యేకతలు
4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్‌ మటన్‌ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్‌ చేశారు. 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశుభ్రమైన వాతావరణంలో కనీసం 10 జీవాలను వధించేందుకు వీలుగా వధశాలతో పాటు డ్రెస్సింగ్, జీవాల అవయవాల (గ్రేడ్స్‌) వారీగా కటింగ్, డ్రెస్సింగ్, ప్యాకేజింగ్, రిటైల్‌ విక్రయాలు జరిపేందుకు వీలుగా రూపొందించారు. వధించేటప్పుడు కానీ, కాల్చేటప్పుడు కానీ వ్యర్థాలు కాదు కనీసం వాసన కూడా బయటకు రాదు. విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలతో కూడిన ఈ వాహనంలో ప్రాసెసింగ్‌ చేసిన తాజా మాంసాన్ని నిల్వ చేసేందుకు అత్యాధునిక రిఫ్రిజరేటర్లు, 100కి పైగా స్టైయిన్‌లెస్‌ స్టీల్‌ బాక్స్‌లు (500 గ్రాములు) ఉంటాయి. వైద్యులు పరీక్షించిన పూర్తి ఆరోగ్యకరమైన జీవాలను మాత్రమే ఇక్కడ విక్రయిస్తారు. వ్యర్థ పదార్థాలను నిల్వ చేసేందుకు వాహనంలోనే డంపింగ్‌ సౌకర్యం ఉంటుంది. జీరో పొల్యూషన్‌తో  పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. లిక్విడ్‌ వేస్ట్‌ కోసం సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ) కూడా వాహనంలోనే ఉంటుంది. మొబైల్‌ మార్ట్‌ నిర్వహణపై హైదరాబాద్‌లోని నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

విధి విధానాల రూపకల్పన
‘పోర్టబుల్‌ మీట్‌ ప్రొడక్షన్‌ అండ్‌ రిటైలింగ్‌ ఫెసిలిటీ (పీ – మార్ట్‌) అని వ్యవహరించే మటన్‌ మార్ట్‌లు తొలుత నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత మండల కేంద్రాలు, పంచాయతీల్లో ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పన జరుగుతోంది. త్వరలోనే వీటిని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం’
– జేపీ వెంకటేశ్వర్లు, ఎండీ, ఏపీఎండీసీ 

మరిన్ని వార్తలు