డీసీజీఐ సూచనల మేరకే చర్యలు

11 Jun, 2021 05:02 IST|Sakshi

రెమ్‌డెసివిర్‌ల కాలపరిమితిని 6 నుంచి 12 నెలలు పెంచుకోవచ్చంది

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కొందరు సిబ్బంది కోవిడ్‌ రోగుల చికిత్సలో నకిలీ స్టిక్కర్లతో గడువు ముగిసిన మందులను వినియోగిస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కాల పరిమితిని 6 నుంచి 12 నెలలకు పెంచవచ్చునంటూ వాటి తయారీ కంపెనీ అయిన మైలాన్‌ చెప్పడంతో ఆ మేరకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇచ్చిన సూచనల మేరకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వివరించారు. అందులో భాగంగానే స్టిక్కర్లు ఉపయోగించడం జరిగిందన్నారు. దీనిని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే సమస్య వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పు లేదన్నారు. డీసీజీఐసూచనల కాపీని కోర్టు ముందుంచారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై డీసీజీఐ వివరణ కోరాలని నిర్ణయించిన కోర్టు ఆ సంస్థను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.   

‘ఎంహెచ్‌సీ’ అమలుకు ఏం చేస్తున్నారు?
మతిస్థిమితం కోల్పోయి రోడ్ల వెంబడి తిరిగే వారిని మెంటల్‌ కేర్‌ హెల్త్‌ (ఎంహెచ్‌సీ ) చట్టం అమలుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎంహెచ్‌సీ చట్టాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖపట్నం ప్రభుత్వ మెంటల్‌ కేర్‌ ఆస్పత్రి సైకియాట్రీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామానంద్‌ సతాపతి రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా పరిగణించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈ నెల 17కి ధర్మాసనం వాయిదా వేసింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు