వాహనమిత్రకు దేవదాయ నిధులు వాడటం లేదు..

6 Jul, 2021 05:05 IST|Sakshi

పిల్‌ను మూసేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కోసం దేవదాయ నిధులను ఉపయోగించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌కు చేసిన కేటా యింపుల నుంచి బ్రాహ్మణ వాహన మిత్రలకే నిధులు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల నుంచి రూ.49 లక్షలను వైఎస్సార్‌ వాహనమిత్ర కోసం విడుదల చేసేందుకు దేవదా య శాఖ స్పెషల్‌ కమిషనర్‌ పరిపాలన అనుమతి నిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిల్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. రూ.49 లక్షలను వైఎస్సార్‌ వాహనమిత్ర కోసం విడుదల చేసేందుకు దేవ ప్రభుత్వం ఈ నెల 15న జారీచేసిన జీఓ 334ను సవాలు చేస్తూ తిరుపతికి చెందిన జి.భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని  ధర్మాసనం  ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది.  

మరిన్ని వార్తలు