నిమ్మ రైతులకు ఊరట

29 Jul, 2020 13:03 IST|Sakshi
యార్డుకు వచ్చిన నిమ్మకాయలను గ్రేడింగ్‌ చేస్తున్న కార్మికులు

కాయల కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు 

బయట రాష్ట్రాల ట్రేడర్స్‌తో చర్చలు 

కోల్‌కతా, కేరళ మార్కెట్లకు ఎగుమతులు 

నిమ్మ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యాపారులతో ఇటీవల ఆ శాఖ అధికారులు చేపట్టిన చర్చలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో రైతులకు మేలు జరుగుతోంది. నాణ్యమైన కాయల కొనుగోలుతో రైతులకు గిట్టుబాటు లభిస్తోంది. 

పొదలకూరు: కరోనా కష్టకాలంలో నిమ్మ రైతులు, వ్యాపారులు దుకాణాలనే మూసివేశారు. తోటల్లోనే కాయలు నేలరాలి కుళ్లిపోతున్న తరుణంలో ఇటీవల వ్యాపారులు దుకాణాలను తెరిచి స్వల్పంగా కాయలను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్న కాయలను ఎగుమతి చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక, తోటల్లోనే కాయలను మగ్గబెట్టుకుంటూ ఆవేదన చెందుతున్నారు.  
నిమ్మ రైతుల అగచాట్లను గుర్తించిన ప్రభుత్వం యార్డుల్లో మార్కెటింగ్‌శాఖ ద్వారా కాయలను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. 
ఈ ప్రయత్నం మెల్లగా సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న సీఎం ఆదేశాల మేరకు బయట రాష్ట్రాల వ్యాపారులు, అధికారులతో మాట్లాడి నిమ్మకాయల ఎగుమతికి లైన్‌ క్లియర్‌ చేశారు.  
ఫలితంగా కుదేలైన నిమ్మ మార్కెట్‌కు ఊరట లభిస్తుందన్న భరోసా కనిపిస్తోంది.  
ప్రభుత్వ ప్రయత్నంతో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా మార్కెట్‌ తెరుచుకుంది.  
కేరళ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో నిమ్మ దిగుమతులను నిలిపివేసింది. అయితే ఇప్పుడిప్పుడే నిమ్మ ఎగుమతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది.  
ఢిల్లీ మార్కెట్‌ తెరుచుకుంటే కాయల ఎగుమతి పెరుగుతుంది.   

ప్రభుత్వ చొరవతో పెరిగిన ధరలు 
నిమ్మ రైతులు కనీసం కాయలు కోసిన కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వ, ప్రైవేట్‌ మార్కెట్లలో మార్కెటింగ్‌శాఖ ద్వారా కాయలను కొనుగోలు చేస్తామని ప్రకటిచింది. 
ఈ ప్రకటనతో నిమ్మ కొనుగోలులో మార్పులు కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆయా మార్కెట్, రైతుల నుంచి వచ్చే కాయల నాణ్యతను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్‌శాఖ నిమ్మకు మద్దతు ధర ప్రకటించింది. 
గూడూరు, పొదలకూరు మార్కెట్లలో కిలో నిమ్మకాయలు రూ.7 వంతున కొనుగోలు చేస్తామన్నారు.  
అయితే వ్యాపారులే మద్దతు ధరకంటే అదనంగా చెల్లిస్తున్నారు.  
పొదలకూరు మార్కెట్లో మంగళవారం నాణ్యత కలిగిన మూడు బస్తాల కాయలకు కిలోకు రూ.13 చెల్లించడం విశేషం.  
ఇప్పటి వరకు రైతుల తోటల్లో మచ్చలు, డాగులు (నాణ్యతలేని కాయలు) దాదాపుగా లేకుండాపోయాయి.  
గురువారం నుంచి నాణ్యత కలిగిన కాయలు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది.  
పొదలకూరులో 25 మంది ట్రేడర్స్‌ ఉండగా ఇప్పటి వరకు ఐదారుగురే దుకాణాలు తెరచి కాయలు కొనుగోలు చేస్తున్నారు.  
మార్కెట్‌ కమిటీ ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రానికి రైతులు వచ్చి ధరల వివరాలను వాకబు చేసుకుని వెళ్తున్నారు.  

ఎగుమతులుంటే కొనుగోలు చేస్తాం 
బయట రాష్ట్రాలకు ఎగుమతులు ఉంటే కాయలను కొనుగోలు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇటీవల రైతుల నుంచి కొనుగోలు చేసి కాయలను ఎగుమతి చేయలేక, కాయలు దెబ్బతిని యార్డుకు దూరంగా పారబోయాల్సి వచ్చింది. –  ఎం.బాలకృష్ణారెడ్డి, వ్యాపారి 

ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది 
నిమ్మ రైతుల విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటోంది. గురువారం నుంచి కాయల ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది. రైతులు సైతం నాణ్యత కలిగిన కాయలను మార్కెట్‌కు తీసుకు రావాలి. వ్యాపారులు మద్దతు ధర కంటే అదనంగా చెల్లిస్తున్నారు.  – అనితాకుమారి, మార్కెట్‌ కమిటీ సెక్రటరీ 

మరిన్ని వార్తలు