తెలంగాణ డీపీఆర్‌లను ఆమోదించొద్దు

4 Oct, 2021 03:37 IST|Sakshi

కేంద్ర జల్‌శక్తి శాఖ, గోదావరి బోర్డులకు తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

సీడబ్ల్యూసీకి ఇటీవల ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించిన తెలంగాణ

ఇందులో ఇప్పటికే సీతారామ ఎత్తిపోతలపై ఏపీ అభ్యంతరం

మిగిలిన వాటిపైనా అభ్యంతరం తెలుపుతూ లేఖలు రాయాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: గోదావరి నదీ జలాలను వినియోగించుకోవడానికి చేపట్టిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పిస్తూ తెలంగాణ సర్కార్‌ పేర్కొన్న నీటి కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ చెబుతున్న మాటల్లో వాస్తవంలేదని స్పష్టంచేసింది. గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి.. నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవడం లేదా జలాలను కొత్త ట్రిబ్యునల్‌ పంపిణీ చేసే వరకూ తెలంగాణ డీపీఆర్‌లను ఆమోదించవద్దంటూ ఏపీ సర్కార్‌ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ, గోదావరి బోర్డులకు లేఖ రాసింది. అలాగే, గత నెల 30న సీతారామ ఎత్తిపోతల పథకం తొలిదశ డీపీఆర్‌పై కూడా అభ్యంతరం వ్యక్తంచేస్తూ లేఖ రాసింది. మిగతా ఐదింటిపైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ లేఖలు రాయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర జల్‌శక్తి శాఖకు, గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది ఏమిటంటే..

కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత ఏదీ?
► మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు గోదావరి పరివాహక ప్రాంతం (బేసిన్‌)లో ఉన్నాయి. తెలంగాణకు ఎగువనున్న రాష్ట్రాల నుంచే 11 ఉప నదులు ప్రవహించి గోదావరిలో కలుస్తున్నాయి. ఒక్క శబరి మాత్రమే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తుంది. ఇక భౌగోళికంగా ఏపీకి ఎగువనున్న తెలంగాణ ఏడాది పొడవునా గోదావరి జలాలు వాడుకునే అవకాశం ఉంది. 
► 2016, జనవరి 21న జరిగిన గోదావరి బోర్డు మూడో సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదా కొత్త ట్రిబ్యునల్‌ ద్వారా గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారే కోరింది. 
► అనంతరం.. అదే ఏడాది నవంబర్‌ 16న జరిగిన బోర్డు నాలుగో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పునర్విభజన తర్వాత 75 శాతం నీటి లభ్యత కింద రెండు రాష్ట్రాలు అప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద తమ నీటి వినియోగాన్ని మార్పు చేసుకున్నాయి. దీని ప్రకారం.. ఏపీ వాటా 775.9.. తెలంగాణ వాటా 649.8 టీఎంసీలు.  ఇక 2004లో వ్యాప్కోస్‌ చేసిన అధ్యయనం ప్రకారం 2 రాష్ట్రాల పరిధిలో 75% లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీలు ఉంటాయని తేల్చింది. 
► రెండు రాష్ట్రాలు కలిపి ఇప్పటికే 1425.7 టీఎంసీలు వాడుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తున్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు నీటి లభ్యతలేదు.

మిగులు జలాలు ఏపీవే..
► గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం.. జీ–1 నుంచి జీ–11 సబ్‌ బేసిన్‌ల వరకూ ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలతోపాటూ మిగులు జలాలు ఏపీకే దక్కుతాయి. 
► గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ 320 టీఎంసీలు.. తెలంగాణ 450.3 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు చేపట్టాయి. దీంతో ఏపీ ప్రాజెక్టులకు 1,095.9, తెలంగాణ ప్రాజెక్టులకు 1,100.1 టీఎంసీలు కలిపి మొత్తం 2,196 టీఎంసీల అవసరం ఉంది. కానీ, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ కొత్తవే. వీటితోపాటూ కాళేశ్వరం సామర్థ్యాన్ని అదనంగా 225 టీఎంసీలకు.. సీతారామ సామర్థ్యాన్ని మరో 30 టీఎంసీలకు పెంచే ప్రాజెక్టులూ కొత్తవే. 
► కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతలపై 2018లోనే అభ్యంతరాలు వ్యక్తంచేశాం. కానీ, సీడబ్ల్యూసీలో కొన్ని విభాగాలు అనుమతులిచ్చాయి. వాటిని తక్షణమే పునఃసమీక్షించాలి.
► ఈ ప్రాజెక్టుల వల్ల దిగువనున్న పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా ఆయకట్టు దెబ్బతింటాయని.. వాటిని అడ్డుకుని దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలని 2020, జూన్‌ 5న జరిగిన గోదావరి బోర్డు తొమ్మిదో భేటీలో కోరాం.
► 2020, అక్టోబర్‌ 6న జరిగిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో 2 రాష్ట్రాలకు గోదావరి జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రకటించారు. కొత్త ప్రాజెక్టుల పనుల్లో ముందుకెళ్లొద్దని ఆదేశించారు.
► ఏపీ హక్కులను దెబ్బతీసేలా.. అనుమతిలేకుండా తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల పనులను నిలిపివేయాలని షెకావత్‌కు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో సీఎం జగన్‌ లేఖ ఇచ్చారు.

ట్రిబ్యునల్‌కు విరుద్ధంగా నీటి మళ్లింపు
► గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డుకు విరుద్ధంగా తెలంగాణ నీటిని మళ్లిస్తోంది. జీ–10 సబ్‌ బేసిన్‌లో ఎగువనున్న ప్రాజెక్టుల వినియోగానికి 301.34 టీఎంసీలను మినహాయించుకుని.. పోలవరం వద్ద 561 టీఎంసీల లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ లెక్కగట్టి అనుమతిచ్చింది.
► దీంతో జీ–10 సబ్‌ బేసిన్‌లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కేటాయించిన 20 టీఎంసీలుపోనూ.. మిగిలిన 281.34 టీఎంసీలు మాత్రమే వాడుకునే అవకాశం తెలంగాణకు ఉంటుంది.
► ఇక ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి గోదావరి జలాలను మళ్లించకూడదని ట్రిబ్యునల్‌ తేల్చిచెప్పింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ట్రిబ్యునల్‌ అవార్డును పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, తెలంగాణ సర్కార్‌ ఏకపక్షంగా నీటిని మళ్లిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించవద్దు. 

తెలంగాణ సర్కార్‌ కొత్త ప్రాజెక్టులు ఇవే..
► పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి (తుపాలకులగూడెం బ్యారేజీ)
► సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ
► ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం  ూ చనాకా–కొరటా బ్యారేజీ
► చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం ూ మొడికుంట వాగు ప్రాజెక్టు 

కేంద్రం, గోదావరి బోర్డుకు వాస్తవాలను చెప్పాం 
గోదావరి జలాల వినియోగంలో వాస్తవాలను కేంద్రానికి, గోదావరి బోర్డుకు వివరించాం. తెలంగాణ సర్కార్‌ అక్రమంగా ప్రాజెక్టులను చేపట్టింది. వీటి డీపీఆర్‌లను పరిశీలించవద్దని.. ఆమోదించవద్దని కోరాం. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు, గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌కూ లేఖ రాశాం. తెలంగాణ డీపీఆర్‌లన్నింటినీ  అధ్యయనం చేసి.. వాటిపైనా లేఖలు రాస్తాం. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ హక్కులను పరిరక్షించాలని కోరుతాం.     
– జె. శ్యామలరావు, కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ 

మరిన్ని వార్తలు