అడవిని హత్తుకున్న సంక్షేమం! 

9 Aug, 2021 02:36 IST|Sakshi

గిరిజన గూడేల్లో అభివృద్ధి వెలుగులు

ఆదివాసీలకు అందుతున్న ఫలాలు

గిరిపుత్రుల కోసం రెండేళ్లలో రూ.14,658 కోట్లు ఖర్చు

నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

సాక్షి, అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతంలో నివసించే బిడ్డిక అన్నాజీరావు గతంలో ప్రభుత్వ పథకం పొందాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి 40 కి.మీ. వెళ్లి ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాల్సిందే. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో ఇప్పుడా దుస్థితి తప్పింది. ఒక్క వంతెన నిర్మాణంతో దాదాపు 160 గిరిజన గూడేలకు రహదారి అందుబాటులోకి వచ్చిందని సాలూరు మండలం మావుడి గ్రామ సర్పంచ్‌ పీడిక సుదర్శనదొర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, నూతన పీహెచ్‌సీల ఏర్పాటుతో తమ గూడెం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్న సంతృప్తి కొట్టాలచెర్వు చెంచుగూడేనికి చెందిన పులిచర్ల ఈళ్లయ్య కళ్లలో కనిపిస్తోంది. తన కాఫీ తోటకు ఇన్నేళ్లకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద భూమి పట్టా ఇచ్చారని పాడేరు మండలం కోట్లగరువు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ, గిరిజనురాలైన జన్ని రాజులమ్మ కృతజ్ఞతలు తెలియచేస్తోంది.

ఒక్క విజయనగరం, విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఏజెన్సీలన్నిటిలోనూ పట్టణాలకు ధీటుగా ఆదివాసీలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది మే వరకు రెండేళ్లలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ఏకంగా రూ.14,658 కోట్లు ఖర్చు చేయడంతో వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో 16,068 గిరిజన జనావాసాలున్నాయి. పలు నగదు బదిలీ పథకాల ద్వారా 29.71 లక్షల మంది గిరిజనుల ఖాతాల్లోకి రూ.4,915 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేసింది. నగదేతర బదిలీ పథకాల ద్వారా 17.11 లక్షల మందికి రూ.1,731 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. మొత్తం రూ.6,646 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. గిరిజన ఉప ప్రణాళిక ద్వారా రూ.8,012 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం గమనార్హం.

గిరిజనోద్ధరణలో ప్రధానమైవి...
గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.746 కోట్లు మంజూరు చేసింది. గిరిజనుల పాలిట శాపంగా మారిన డోలీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా బైక్‌ అంబులెన్సులు తెస్తోంది. 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు (సీహెచ్‌డబ్ల్యూ) కేవలం రూ.400 మాత్రమే ఉన్న జీతాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్‌ ఉండటంతో పూర్తి న్యాయం జరగడంలేదని గుర్తించి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా కుంబా రవిబాబును నియమించింది.

గిరిజన రైతులకు భూ యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌ (ఆర్వోఎఫ్‌ఆర్‌) ద్వారా 2.28 లక్షల ఎకరాలకు పట్టాలను పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది. 165 కొత్త గిరిజన పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులుగా వారే ఎన్నికయ్యేలా రిజర్వ్‌ చేస్తూ జీవో నెంబర్‌ 560 తెచ్చింది. 4,76,206 గిరిజనుల కుటుంబాలకు గృహావసరాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తూ జీవో నెంబర్‌ 94 జారీ చేసింది. సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ కురుపాంలో రూ.153 కోట్లతో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు శంకుస్థాపన జరిగింది. 

విశాఖలో ట్రైబల్‌ రీసెర్చ్‌ మిషన్‌ భవనం
కరోనా కష్టకాలంలో గిరిజనులకు అండగా నిలిచిన జీసీసీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇటీవల 5 అవార్డులను ప్రకటించింది. రెండేళ్లలో రూ.450 కోట్లతో విద్యా సంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. విశాఖ జిల్లా తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన సమరయోధుల మ్యూజియం, కాపులుప్పాడలో రూ.45 కోట్లతో అల్లూరి స్మారక మ్యూజియంను నిర్మించనున్నారు. విశాఖలో రూ.10 కోట్లతో ట్రైబల్‌ రీసెర్చ్‌ మిషన్‌ (టీఆర్‌ఎం) భవన నిర్మాణం పూర్తైంది. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు గత సర్కారు ఇచ్చిన అనుమతిని పూర్తిగా రద్దు చేసి ఆదివాసీలకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారు.

గర్వంగా చెప్పుకుంటాం..
ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఆగస్టు 9వతేదీని  అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా 1994లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఏపీలో రెండేళ్లలో సాధించిన గిరిజనాభివృద్ధిని అంతర్జాతీయ గిరిజన దినోత్సవం రోజే కాదు.. ఎప్పుడైనా గర్వంగా చెప్పగలం. సీఎం జగన్‌ దార్శనికతతో గిరిజన ప్రాంతాలు కళకళలాడుతున్నాయి.   
 – పాముల పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి  

మరిన్ని వార్తలు