బాలికల చదువులకు సర్కారు బడి ఆసరా

3 Sep, 2021 03:46 IST|Sakshi

అత్యధిక శాతం చేరికలు ప్రభుత్వ పాఠశాలల్లోనే..

అభివృద్ధి కార్యక్రమాలు, ప్రోత్సాహంతో పెరిగిన చేరికలు

సమీపంలో మెరుగైన వసతులతో ఉన్న ప్రభుత్వ స్కూళ్లవైపు తల్లిదండ్రుల మొగ్గు

అందుబాటులో ఉండడంతో పాటు బాలికలకు భద్రత

అమ్మ ఒడితో బాలికలకు దగ్గరైన చదువులు.. నాడు – నేడుతో పెద్ద ఎత్తున సదుపాయాల కల్పన

జగనన్న గోరుముద్దతో పౌష్టికాహారం

మన పాఠశాలల కోసం మనమేం చేయాలి?.. అని అనుకున్నప్పుడల్లా నా కళ్లముందొక నిరుపేద బాలిక కనిపిస్తుంది. ఆమె ఒక దళిత బాలిక.. గిరిజన బాలిక.. ముస్లిం బాలిక.. దివ్యాంగ బాలిక. ఆమెకి చదువుకోవాలని ఉంది. ప్రపంచంతో పోటీ పడాలని ఉంది. ఆమెకి మనందరి మద్దతు కావాలి. ఆ ఆలోచన రాగానే నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఆ పిల్లల కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది.
–అధికారం చేపట్టిన తర్వాత సమీక్షలో సీఎం చెప్పిన మాటను తు.చ తప్పకుండా పాటించే సీఎం జగన్‌ వాటికి కార్యరూపం ఇచ్చారు.

సాక్షి, అమరావతి: విద్యారంగంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు, విప్లవాత్మక నిర్ణయాలు బాలికా విద్యకు గట్టి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సదుపాయాలు లేకపోవడం, దూర ప్రాంతాల్లోని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల భారాన్ని భరించలేక ఆడపిల్లలను ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితం చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు వారిని చిరునవ్వుతో పాఠశాలలకు సాగనంపుతున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు బాలికలను చదువులకు చేరువ చేశాయి.

నాడు – నేడు.. ఎంత మార్పు!
ప్రభుత్వ పాఠశాలల్లో బాలురతో పాటు బాలికల చేరికల్లోనూ గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. 2014–15లో ప్రభుత్వ, ప్రైవేట్‌తో కలిపి అన్ని పాఠశాలల్లో 72 లక్షల మంది విద్యార్థులు చేరగా వారిలో బాలురు 37.11 లక్షల మంది, బాలికలు 34.98 లక్షల మంది ఉన్నారు. అదే 2018–19లో టీడీపీ అధికారం నుంచి వైదొలగేనాటికి 70.43 లక్షల మంది మాత్రమే విద్యార్థులు ఉండటం గమనార్హం.  లక్షల మంది చదువులకు దూరమైనట్లు తెలుస్తోంది. ఇక 2020–21లో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో 73.05 లక్షల మంది చేరగా వీరిలో బాలురు 37.05 లక్షల మంది, బాలికలు 35.06 లక్షల మంది ఉన్నారు. 2021–22లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోనే అత్యధికంగా చేరికలు నమోదవుతున్నాయి. 

ప్రభుత్వ పాఠశాలలపై గత సర్కారు నిర్లక్ష్యం
విద్యారంగాన్ని విస్మరించిన గత సర్కారు ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు కూడా కరువవడంతో బాలికలు చదువులకు దూరమయ్యారు. నిరుపేద విద్యార్థినులు ఇంటినుంచి భోజనం తీసుకురాలేక, స్కూళ్లో నాసిరకం ఆహారాన్ని తినలేక అవస్థలు ఎదుర్కొన్నారు. వారికిచ్చే దుస్తులు, ఇతర వస్తువుల పంపిణీలోనూ గత సర్కారు పెద్దలు అక్రమాలకు తెరతీయడంతో నాణ్యతలేని, చాలీచాలని యూనిఫారాలే దిక్కయ్యాయి. ఇక ఇతర వస్తువులు ఏవీ పంపిణీ చేయలేదు. ఇలాంటి దుస్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు దూరమై పెద్ద ఎత్తున డ్రాపౌట్లు నమోదయ్యాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తెలుగు మాధ్యమమే ఉండడం కూడా విద్యార్థుల చేరికలు తగ్గిపోవటానికి మరో ప్రధాన కారణం. తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంగ్లీషు మీడియంలో చదివించాలని తల్లిదండ్రులు ఆశపడ్డా ప్రభుత్వ పాఠశాలల్లో అందుకు అవకాశం లేకపోవడం పెద్ద లోపంగా మారింది. లేదంటే అప్పోసప్పో చేసి ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు గణనీయంగా తగ్గిపోగా ప్రైవేట్‌ స్కూళ్లలో పెరుగుతూ వచ్చాయి. 2014–15లో ప్రభుత్వ పాఠశాలల్లో 44,38,744 మంది విద్యార్థులుండగా 2018–19 నాటికి 39,47,320కి పడిపోయింది. లక్షల సంఖ్యలో విద్యార్థులు స్కూళ్లకు దూరమయ్యారు.

రెండేళ్లలో కళ్లెదుటే కనిపిస్తున్న మార్పులు
గత రెండేళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమూలంగా మారిపోయింది. ముఖ్యమంత్రి జగన్‌ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసేలా చర్యలు తీసుకున్నారు. మరుగుదొడ్లు, మంచినీరు, డ్యూయెల్‌ డెస్కులు, గ్రీన్‌చాక్‌ బోర్డులు, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లు, రంగులతో ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడంతోపాటు జగనన్న విద్యాకానుక కింద 3 జతల దుస్తులు, షూ, సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్య పుస్తకాలు, వర్కుబుక్కులు, నోట్సులు పంపిణీ చేస్తున్నారు. గతంలో తినడానికి వీల్లేని విధంగా ఉండే మధ్యాహ్న భోజనాన్ని రోజుకో రకమైన మెనూతో రుచికరంగా జగనన్న గోరుముద్దను ప్రవేశపెట్టారు. ఇలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చడానికి క్యూ కడుతున్నారు. చివరకు ప్రభుత్వ స్కూళ్లలో ఇక సీట్లు లేవనే బోర్డులు ఏర్పాటు చేసేలా అవి అభివృద్ధి చెందాయి. ప్రధానంగా బాలికల చదువులపై శ్రద్ధ వహించి తల్లిదండ్రులు స్కూళ్లకు పంపిస్తున్నారు.

ఏకంగా 7.84 లక్షలు పెరిగిన చేరికలు
రాష్ట్రంలో రెండేళ్లలో స్కూల్‌ డ్రాపౌట్ల శాతం భారీగా తగ్గింది. గరిష్ట చేరికల నిష్పత్తి (జీఈఆర్‌)లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన అనంతరం 2019–20లో విద్యార్థుల చేరికలు 72,43,269కు, 2020–21లో 73,05,533కి పెరిగాయి. గత సర్కారు హయాంతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఏకంగా 7.84 లక్షల చేరికలు పెరిగాయి. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం 2021–22లో ప్రభుత్వ స్కూళ్లలో చేరిన వారిలో బాలికలు 23,82,860 మంది ఉండగా బాలురు 23,49,204 మంది ఉన్నారు. 

మరిన్ని వార్తలు