ప్రభుత్వ సేవలు.. హెల్ప్‌లైన్‌ నంబర్లు

29 Sep, 2020 10:09 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ధనిక, పేద, కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉచిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యవసర సమయాల్లో ప్రజలు పైసా ఖర్చు లేకుండా ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేస్తే సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. వీటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్లను, సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే వీటి ముఖ్యోద్దేశం.

ఆ హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవీ.. 

 • 14400 (అవినీతి నిరోధం): 
  వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నంబర్‌ కేటాయించారు. 14400 నంబరుకు ఫోన్‌ చేసిన వారి పేరు, వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా ఈ నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.
 •  1912 (విద్యుత్‌ సేవలు) 
  విద్యుత్‌ సరఫరాలో, సిబ్బంది వల్ల సమస్యలు ఎదురైతే ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి, పరిష్కారం పొందవచ్చు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఈ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది
 • 14500 (ఇసుక, మద్యం) 
  ఎక్కడైనా సారా అమ్మకాలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిస్తే 14500 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. దీనిద్వారా మద్యం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు కూడా సాయం పొందవచ్చు. అలాగే ఇసుక డోర్‌ డెలివరీ పొందాలనుకొనే వారు కూడా ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.
 •  108 (ప్రభుత్వ అంబులెన్స్‌) 
  అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రమాదాలకు గురై, గాయపడిన వారు 108కు ఫోన్‌ చేయవచ్చు. కాల్‌ సెంటర్‌ నుంచి సమీపంలోని 108 వాహన సిబ్బందికి సమాచారం వస్తుంది. వారు వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి, ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు.
 •  1907 (వ్యవసాయం)
  వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఈ నంబరుకు ఫోన్‌ చేయవచ్చు. సాగులో మెళకువలు, దిగుబడులు, సలహాలు, సూచనలను రైతులు పొందవచ్చు.
 •  104 (వైద్యం, ఆరోగ్యం) 
  ఆస్పత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, వైద్యసేవలు అందించేందుకు 104 వాహనం ఉపయోగపడుతుంది. ఈ సేవలు పొందాలనుకునే వారు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. ఈ వాహనంలోని సిబ్బంది ఒక స్థాయి అనారోగ్య సమస్యలకు సంబంధిత టెస్టింగ్, ల్యాబ్‌లో పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు. అలాగే ఆస్పత్రిలో ప్రసవాంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ అంబులెన్స్‌ సేవలు కూడా అందిస్తున్నారు.
 •  100 (పోలీసు సేవలు) 
  ఏ సమయంలోనైనా సరే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సాయం పొందేందుకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ 24 గంటలూ పని చేస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి, మాట్లాడే ప్రతి మాటా రికార్డవుతుంది.
 •  112, 181 (దిశ) 
  లైంగిక వేధింపులకు గురవుతున్నా, విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా తమను కాపాడుకొనేందుకు బాలికలు, యువతులు, మహిళలు ఈ నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. హైదరాబాద్‌లో ఓ యువతిపై జరిగిన అమానవీయ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న మహిళలు 112 లేదా 181 నంబర్లకు ఫోన్‌ చేస్తే కంట్రోల్‌ రూము నుంచి వారు ఫోన్‌ చేసిన ప్రదేశాన్ని గుర్తించి, సమీపంలోని స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. అప్రమత్తమైన ఆ పోలీసు అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకొని రక్షణ చర్యలు చేపడతారు. 
 •  1902 (ప్రజా సమస్యలు) 
  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలకు సంబంధించిన సమాచారం ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే లభిస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి, సంబంధిత అధికారులకు సమస్యలు తెలియజేయవచ్చు. గడువు తేదీలోగా వాటిని పరిష్కరించుకోవచ్చు. లేకుంటే మళ్లీ ఫిర్యాదు చేయవచ్చు. దీనివలన అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయి. 
 •  101 (అగ్నిమాపక కేంద్రం) 
  ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సాయం కోసం ఈ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ప్రమాదాన్ని నివారిస్తారు. లేదా ప్రమాద స్థాయిని తగ్గిస్తారు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా