అత్యాచార బాధితురాలికి ప్రభుత్వ అండ

30 Jul, 2021 05:27 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రులు సుచరిత, తానేటి వనిత

రూ.5 లక్షలు అందజేసిన మంత్రులు సుచరిత, తానేటి వనిత

నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటన

గుంటూరు మెడికల్‌: గుంటూరు జిల్లా రొంపిచర్లలో దివ్యాంగురాలిపై జరిగిన అత్యాచారం ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గురువారం ఆమె మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనితతో కలిసి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న దివ్యాంగురాలైన అత్యాచార బాధితురాలిని, మరో ఘటనలో అత్యాచారానికి గురైన ఏడునెలల పసికందు కుటుంబాన్ని పరామర్శించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దివ్యాంగురాలి కుటుంబానికి రూ. 5లక్షల చెక్కును అందజేశారు. అనంతరం హోంమంత్రి  సుచరిత మీడియాతో మాట్లాడుతూ .. దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన నిందితులను ‘దిశ’ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామన్నారు. దివ్యాంగురాలి సోదరుడికి సైతం అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ..  బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు