శిరీష కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌ సర్కారు అండ

3 Sep, 2021 04:14 IST|Sakshi

రూ.5 లక్షల చెక్కు అందజేత 

ఆమె సోదరుడికి ఉద్యోగం 

బద్వేలు అర్బన్‌: వైఎస్సార్‌ జిల్లా బద్వేలు మండలం చింతలచెరువు గ్రామంలో ఈ ఏడాది జూన్‌ 18న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన గొడుగునూరు శిరీష కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. శిరీష కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించడంతోపాటు ఆమె సోదరుడు నాగేంద్రకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. చింతలచెరువు గ్రామానికి చెందిన గొడుగునూరు సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె శిరీష (19) బద్వేలులోని ఓ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

అట్లూరు మండలం మాడపూరు పంచాయతీ చిన్నరాజుపల్లె గ్రామానికి చెందిన చరణ్‌ అనే యువకుడు ఏడాది కాలంగా శిరీషను ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆమె నిరాకరించడంతో చరణ్‌ కత్తితో విచక్షణా రహితంగా శిరీష గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయంతో పాటు శిరీష సోదరుడైన నాగేంద్రకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం బద్వేలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శిరీష కుటుంబ సభ్యులకు చెక్కును, ఉద్యోగ నియామక పత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ యానాదయ్య అందజేశారు.  

టీడీపీవి నీచ రాజకీయాలు 
ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ యానాదయ్య మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో మహిళలపై ఎన్నో దాడులు, హత్యలు జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించిన ఆ పార్టీ నేతలు శిరీష హత్య విషయంలో అనవసర రాద్ధాంతం చేసి నీచ రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లాలో నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారుడు నరేష్‌ను హత్య చేస్తే ఏమాత్రం స్పందించని టీడీపీ నాయకులు నేడు రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు.

రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. శిరీష కుటుంబ సభ్యులు టీడీపీ అభిమానులైనప్పటికీ పార్టీ చూడకుండా ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఉద్యోగం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ వాకమళ్ల రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు