ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

5 Jan, 2023 21:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: అనాధీనం, ఖాళీగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో (ఆర్‌ఎస్‌ఆర్‌) నమోదైన వేలాది ఎకరాల భూముల సమస్యను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రకాల భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందుకోసం 2017 చుక్కల భూముల చట్టాన్ని సవరించింది. ఈ మేరకు 2022 ఏపీ చుక్కల భూముల (సవరణ) ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జారీ చేశారు. దీంతో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అవకాశం ఏర్పడింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించి దాదాపు 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందుతారు. అనాధీనం భూములు అనకా­పల్లి, శ్రీకాకుళం, అంబేడ్కర్‌ కోనసీమ, విశాఖ జిల్లా­ల్లో ఎక్కువగా ఉండగా, ఖాళీ (కాలమ్‌) భూములు రాయ­లసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నా­యి. రెవె­న్యూ రికార్డుల్లో పట్టాదారు, రిమార్కుల కాలమ్‌­లలో చుక్కలు ఉన్నట్లుగానే అనాధీనం, ఖాళీ (చుక్కల బదులు ఖాళీగా వదిలేసిన) భూములు రాష్ట్ర­వ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఈ కేటగిరీ భూ­ము­లను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఇప్పటివరకు ఎలాంటి అవకాశాలూ లేవు. ఈ తరహా భూములు ఎక్కువగా ఉన్నట్లు పలు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు.

ఆ భూముల రైతులు చుక్కల భూముల చట్టం ప్రకారం వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తులు పెడుతున్నట్లు తెలిపారు. కానీ, చుక్కల భూముల చట్టంలో అనాధీనం, ఖాళీ భూముల ప్రస్తావన లేకపోవడంతో ఆ దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో ఈ భూముల సమస్య పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం దానిపై దృష్టి సారించి చుక్కల భూముల చట్టం ద్వారా వాటికి పరిష్కారం చూపింది. అనాధీనం, ఖాళీ కాలమ్‌ భూములను చుక్కల భూముల చట్టంలో చేర్చింది. కొత్తగా ఈ చట్టంలో చుక్కల భూములతోపాటు అనాధీనం, ఖాళీ భూములు (బ్లాంక్‌ ల్యాండ్స్‌) అని రెండు కాలమ్స్‌ను అదనంగా కలిపారు. ఇకపై ఈ భూములను చుక్కల భూముల మాదిరిగానే కచ్చితమైన రికార్డులు ఉంటే నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు భూములుగా నిర్ధారించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించవచ్చు.

అలాగే 2017 చుక్కల భూముల చట్టాన్ని కేవలం రాయలసీమ ప్రాంతంలోని భూములకే పరిమితమయ్యేలా కాలమ్‌ 16, 17 అని పేర్కొ­న్నా­రు. ఆ కాలమ్‌లు రాయలసీమ జిల్లాల్లో మాత్రమే ఉండేవి. కోస్తా జిల్లాల్లోని ఆర్‌ఎస్‌ఆర్‌లో 11, 12 కాలమ్‌ వరకే ఉండటంతో ఈ చట్టం అక్కడి జిల్లా­లకు వర్తించడంలేదు. తాజా సవరణ చట్టంలో ఏ కా­ల­మ్‌లో చుక్కలు ఉన్నా, అనాధీనం, బ్లాంక్‌ ఉన్నా దానికి ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు