శ్రీకాంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది

31 Aug, 2020 05:30 IST|Sakshi

శిరోముండనం బాధితుడికి మంత్రి ముత్తంశెట్టి భరోసా

సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: విశాఖపట్నంలో శిరోముండనం బాధితుడు పర్రి శ్రీకాంత్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. జనసేన సానుభూతిపరుడు, టీడీపీ నేతలతో వ్యాపార భాగస్వామి, సినీ దర్శక, నిర్మాత నూతన్‌నాయుడు ఇంట్లో దాష్టీకానికి గురైన దళిత యువకుడు శ్రీకాంత్‌ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారన్నారు. బాధితుడు శ్రీకాంత్‌ను మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆదివారం పరామర్శించారు.  

► శ్రీకాంత్‌కు ప్రభుత్వం తరఫున రూ.లక్ష సాయం అందజేయటంతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి ప్రకటించారు.  
► కేసు విషయంలో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు. భవిష్యత్‌లో మరెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు.
► బాధితులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.  
► బాధితుడు శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ తన సొంత నిధులు రూ.50 వేలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.  
► ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఆర్డీవో పెంచల కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఏడుగురు నిందితులు 
శ్రీకాంత్‌ను హింసించిన ఘటనలో అరెస్ట్‌ చేసిన ఏడుగురు నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కి పంపించారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచగా.. వారికి సెప్టెంబర్‌ 11 వరకు రిమాండ్‌ విధించారు. ఆరిలోవలో ఉ¯న్న విశాఖ జిల్లా సెంట్రల్‌ జైలుకు నూతన్‌నాయుడి భార్య ప్రియామాధురితో సహా బ్యూటీషియన్‌ ఇందిరారాణి, వరహాలు, ఝాన్సీ, సౌజన్యలను తరలించగా బార్బర్‌ రవికుమార్, బాల గంగాధర్‌ను అనకాపల్లి సబ్‌ జైలుకు పంపించినట్లు డీసీపీ (క్రైం) సురేష్‌బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు