బిందు సేద్యం.. సర్కారు సాయం

26 Nov, 2022 23:19 IST|Sakshi
డ్రిప్, స్ప్రింకర్ల ఏర్పాటును పరిశీలిస్తున్న అధికారులు

అన్నదాతలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం 

బిందు సేద్యానికి 90 శాతం, తుంపర సేద్యానికి 55 శాతం సబ్సిడీ 

పరికరాల అందజేతలో రాష్ట్రంలో అన్నమయ్యకు రెండోస్థానం 

జిల్లాలో 14 వేల హెక్టార్లలో సాగుకు మైక్రో ఇరిగేషన్‌ ప్రణాళిక 

సాక్షి రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాల ఆదుకుంటూ వస్తోంది. ఒకవైపు రైతు భరోసా, మరోవైపువైఎస్సార్‌ పంటల బీమా, ఇంకోవైపు సున్నావడ్డీ ఇలా చెబుతూ పోతే రైతు భరోసా కేంద్రాల వరకు అన్నదాతలకు సర్కార్‌ అండగా ఉంటూ వస్తోంది. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లతోపాటు యంత్రపరికరాలను ఇటీవల ప్రభుత్వం అందించింది.

పంట పొలాల్లో ప్రతి నీటి చుక్క వృథా చేయకుండా సద్వినియోగం చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి విపత్తు తలెత్తకుండా ఉండేందుకు రైతులకు మైక్రో ఇరిగేషన్‌ ద్వారా బిందు, తుంపర పరికరాలను అందిస్తోంది. ప్రతి నీటి బిందువును పొదుపుగా వాడుకోవడం మొక్కలతోపాటు ప్రకృతికి మంచిదే. ఈ నేపధ్యంలోనే కాలువలు, బోర్ల ద్వారా పారగట్టే పద్ధతికి రైతులు స్వస్తి పలుకుతూ ఇటీవలి కాలంలో ఎక్కువగా బిందు, తుంపర సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు.

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పాటును అందిస్తూ వస్తోంది. స్పింక్లర్లు, డ్రిప్‌లను వినియోగించుకునే రైతులకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలను అందించి ప్రోత్సాహం అందిస్తోంది. 2022–23కి సంబంధించి అన్నమయ్య జిల్లాలో 14 వేల హెక్టార్లకు పరికరాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుని మైక్రో ఇరిగేషన్‌ శాఖ ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. డ్రిప్, స్ప్రింకర్లకు భారీ ఎత్తన సబ్సిడీ ఇస్తున్నారు.  

ఇప్పటివరకు 16,920 మంది రైతుల నమోదు 
అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు సుమారు 16,920 మంది రైతులు పరికరాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ ఏడాది మే మొదటి వారంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాల్లో 16,920 మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా వారికి సంబంధించి 19046 హెక్టార్ల భూమి అవసరమని దరఖాస్తుల్లో పొందుపరిచారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి డ్రిప్‌లకు 12 వేల హెక్టార్లు, స్ప్రింకర్లకు 2 వేల హెక్టార్లకు పరికరాలు అందించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు 2,893 మంది రైతులకు 3145 హెక్టార్లకుగాను బిందు, తుంపెర సేద్యం పరికరాలను అందించారు. రైతులందరూ జిల్లాలోని ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతోపాటు రైతు వాటాకు సంబంధించిన మొత్తాలను ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా అధికారులకు పంపుతున్నారు. అయితే 14 వేల హెక్టార్ల లక్ష్యం ఉన్న నేపథ్యంలో అవసరమైన ప్రతిరైతుకు అందించేలా మైక్రో ఇరిగేషన్‌ అధికారులు ముందుకు వెళుతున్నారు. 

రాష్ట్రంలో రెండోస్థానం 
అన్నమయ్య జిల్లాలో సూక్ష్మసేద్య పరికరాలకు సంబంధించి ప్రభుత్వం రాయితీతో అందిస్తోంది. వాటికి సంబంధించి వేగంగా రైతులకు అందించడంలో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా రెండవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో అనంతపురం, రెండోస్థానంలో అన్నమయ్య, మూడవ స్థానంలో వైఎస్సార్‌ ఉన్నాయి. కంపెనీల ద్వారా పరికరాలు వేగవంతంగా అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

బోరు వద్ద డ్రిప్‌పైపు వద్ద ఈ మహిళ పేరు గుణసుందరి. ఈమెది ఓబులవారిపల్లె మండలం బొమ్మవరం గ్రామం. ఈమెకు 0.69 హెక్టార్ల భూమి ఉంది. అందులో పసుపు పంట సాగు చేశారు. అయితే డ్రిప్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవలే అందించారు. 90,103 రూపాయలు అంచనా కాగా, రైతు వాటా పోను రూ 81,032 విలువైన డ్రిప్‌ పరికరాలు అందజేయడంతోపాటు పొలంలో బిగించారు. దీంతో ఆమె ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 

8రైతులకు భారీ రాయితీ 
అన్నమయ్య జిల్లాలో ఉద్యాన పంటలు, ఇతర సాధారణ పంటలు సాగు చేసే రైతులకు బిందు, తుంపర పరికరాలను మైక్రో ఇరిగేషన్‌ శాఖ ద్వారా అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం భారీ రాయితీలను కూడా రైతులకు పూర్తి స్థాయిలో అందించేలా ప్రణాళికలు రూపొందించి అందజేస్తోంది. డ్రిప్‌కు సంబంధించి ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు 90 శాతం సబ్సిడీతో రూ. 2.18 లక్షల వరకు రాయితీ వర్తించనుంది.

అలాగే 5–10 ఎకరాల పొలం ఉన్న రైతులకు 70 శాతం సబ్సిడీతో రూ. 3.46 లక్షల మేర రాయితీ అందించనున్నారు. స్ప్రింకర్లకు సంబంధించి ఐదు ఎకరాల్లోపు అయితే 55 శాతం రాయితీ, ఐదు ఎకరాలకు పైబడిన రైతులకు 45 శాతం రాయితీతో అందిస్తున్నారు. ఇప్పటివరకు నమోదు చేసుకున్న రైతులకు సంబంధించి వరుస క్రమంలో తుంపెర, బిందు సేద్యం పరికరాలను ఎంపిక చేసిన ఆయా కంపెనీల ద్వారా రైతన్నలకు అప్పజెబుతున్నారు. 

అర్హులందరికీ సబ్సిడీపై పరికరాలు 
అన్నమయ్య జిల్లాలో అర్హులైన రైతులందరికీ సబ్సిడీపై పరికరాలు అందిస్తున్నాం. జిల్లాకు డ్రిప్‌నకు సంబంధించి 12 వేల హెక్టార్లు, స్ప్రింకర్లకు సంబంధించి 2 వేల హెక్టార్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు దరఖాస్తు చేసుకున్న అనంతరం వారికి కంపెనీల ద్వారా సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే 3145 హెక్టార్లకుగాను బిందు, తుంపెర సేద్యం పరికరాలను అందించాము. ప్రభుత్వం కూడా భారీ రాయితీతో పరికరాలను అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తోంది.     – వెంకటేశ్వరరెడ్డి, జిల్లా సూక్ష్మ నీటి సేద్య అ«ధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా  

మరిన్ని వార్తలు