వారిని నేరుగా విజయవాడకు తరలించండి

2 Mar, 2022 04:29 IST|Sakshi
అంజనీకుమారి, అఖిల

విదేశాంగ శాఖ మంత్రికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి

ఢిల్లీకి మరో 17మంది తెలుగు విద్యార్థులు రాక

విజయవాడకు వచ్చిన ముగ్గురు విద్యార్థులు

సాక్షి, న్యూఢిల్లీ/మద్దికెర/చీమకుర్తి/చిలమత్తూరు/గన్నవరం: ఉక్రెయిన్‌ నుంచి స్లోవేకియా చేరుకోనున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్ని నేరుగా విజయవాడకు తరలించాలని కేంద్ర విదేశాంగ శాఖకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ మంగళవారం లేఖ రాశారు. తెలుగు విద్యార్థులు ఇప్పటివరకు ఢిల్లీ, ముంబైలకు వచ్చి అక్కడి నుంచి వారివారి స్వస్థలాలకు చేరుకుంటున్నారని.. కానీ, అలా కాకుండా.. ఉక్రెయిన్‌ నుంచి వచ్చే తెలుగు విద్యార్థులందరినీ ఒకే విమానంలో విజయవాడకు తరలించాలని కోరారు. తద్వారా విద్యార్థులు వారివారి స్వస్థలాలకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. 

రైలులో 900 మంది విద్యార్థులు హంగేరీకి తరలింపు
ఇక భారత్‌కు చెందిన మరో 900 మంది విద్యార్థులను ఉక్రెయిన్‌లోని జపరోజ్జియా నుంచి 1,400 కి.మీ. దూరంలోని హంగేరీ దేశానికి అధికారులు ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలులో తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన సాయితేజ అనే విద్యార్థి మంగళవారం తన తల్లిదండ్రులు ధనుంజయ, పద్మావతిలకు ఈ సమాచారం ఇచ్చారు. హంగేరీ నుంచి ఢిల్లీ లేదా ముంబై చేరుకునేందుకు అధికారులు విమాన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

సీఎం కార్యాలయ తక్షణ స్పందన
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల కేంద్రానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త పుణ్యవతి, శ్రీనివాసులు కుమారుడు కదిరిసాని అరవింద్‌ గౌడ్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో చిక్కుకుపోగా.. ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే స్పందించింది. అరవింద్‌ విషయాన్ని తల్లి పుణ్యవతి సోమవారం ఎంపీపీ పురుషోత్తంరెడ్డి సహకారంతో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం కార్యాలయ అధికారులు వేగంగా స్పందించారు. అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రావడానికి వీలుగా ఏర్పాట్లుచేయించారు. ఫలితంగా అరవింద్‌ ఇప్పటికే రుమేనియాకు చేరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా సమాచారం అందిందని పుణ్యవతి చెబుతూ సర్కారు స్పందించిన తీరుపై హర్షం వ్యక్తంచేశారు. 

17మంది తెలుగు విద్యార్థులు రాక
మరోవైపు.. ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీకి మంగళవారం 17 మంది తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఏపీ వారు కాగా, 11 మంది తెలంగాణ వారని ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌ల అధికారులు తెలిపారు. ఆయా విద్యార్థులకు భోజన, వసతి, రవాణా సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు వారు వివరించారు.

విజయవాడకు చేరుకున్న ముగ్గురు విద్యార్థులు..
ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన డాక్టర్లు నత్తల జగన్మోహన్‌రావు, సరళాదేవి దంపతుల కుమారుడు నత్తల సుధేష్‌  క్షేమంగా తన ఇంటికి చేరుకున్నారు. అధికారులు  సురక్షితంగా ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేర్చినట్లు సుధేష్‌ తెలిపారు. కుమారుడు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, మరో ఇరువురు విద్యార్థినులు మంగళవారం రాత్రి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. రొమేనియా నుంచి ప్రత్యేక విమానాల్లో ముంబై, ఢిల్లీకి వచ్చిన తూర్పు గో దావరి జిల్లా తుని మండలం ఎస్‌.అన్నవరం గ్రామానికి చెందిన ఎ.అంజనీకుమారి, ప్రకా శం జిల్లా చీరాలకు చెందిన వై.అఖిల వేర్వేరు విమానాల్లో ఇక్కడికి చేరుకున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. వీరిరువురినీ ప్రభుత్వ వాహనంలో అధికారులు ఇంటికి పంపించారు. అఖిల, అంజనీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఆహారం, నీరు దొరకని పరిస్ధితి నెలకొందని.. అతికష్టం మీద నడుచుకుంటూ రొమేనియా బోర్డర్‌కు వచ్చామన్నారు. తమను క్షేమంగా తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు