3 ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం

8 Feb, 2023 04:15 IST|Sakshi

అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గమ్మ ఆలయాలకు వేర్వేరుగా ఉత్తర్వుల జారీ  

బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ల కాలపరిమితి 

సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌ను ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 13 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తూ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎస్వీ సుధాకరరావును ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 14 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించారు. అదే విధంగా విజయవాడ శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది ట్రస్టు బోర్డు సభ్యులను నియమించారు. ఈ మూడింటికి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.

విజయవాడ దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్‌ను సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం సమావేశమై ఎన్నుకుంటారు. అదనంగా ఆయా ఆలయాలలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వారు ఆయా ట్రస్టు బోర్డులో ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా ఆలయాల ట్రస్టు బోర్డులలోని సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారని తెలిపింది. 

దుర్గమ్మ ఆలయ చైర్మన్‌గా కర్నాటి రాంబాబు 
ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. చైర్మన్‌గా కర్నాటి రాంబాబు, సభ్యులుగా కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కళ్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, తొత్తడి వేదకుమారి చేత ఈవో భ్రమరాంబ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలుకులూరి రామసీత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు