యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

4 Jun, 2023 05:11 IST|Sakshi
ఒడిశాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

ఎక్కడికక్కడ తక్షణ వైద్యానికి ఏర్పాట్లు

సమన్వయం కోసం ప్రత్యేక అధికారులు

అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు

సాక్షి, అమరావతి /విశాఖపట్నం/కొరాపుట్‌ / సాక్షి నెట్‌వర్క్‌: ఒడిశా రాష్ట్రంలో సంభవించిన ఘోర రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పాలుపంచుకుంటోంది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒడిశా సరిహద్దుల్లో ఉండే మన రాష్ట్రంలోని ఆస్పత్రులను  అప్రమత్తం చేశారు.

108 అంబులెన్స్‌లు 20, ఇతర అంబులెన్స్‌లు 25, మహాప్రస్థానం వాహనాలు 15 కలిపి 60 వాహనాలు  ఘటన స్థలానికి తరలించారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. రైలులో ప్రయాణించిన మన రాష్ట్ర ప్రయాణికుల వివరాల ఆధారంగా కో ఆర్డినేట్‌ చేసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లాల డీఎంహెచ్‌ఒలను ఆదేశించారు. 

అవసరమైతే హెలికాఫ్టర్‌ సేవలు: మంత్రి అమర్‌నాథ్‌
రైలు ప్రమాద బాధితులకు అత్యవసర సాయం అవసరమైతే హెలికాఫ్టర్‌ సేవలు వినియెగించుకోవాలని సీఎం  ఆదేశించారని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో కలిసి శనివారం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఎవరైనా రైలులో ప్రయాణించి, ఫోన్‌కి స్పందించక­పోతే వారిని గుర్తించేందుకు ప్రాధాన్యత ఇస్తామ­న్నారు. ఖరగ్‌పూర్‌ నుంచి చాలా మంది తెలుగు వారు ఇదే రైలులో ప్రయాణించినట్లు తెలిసింద­న్నారు. ఒక క్షతగాత్రుడి అభ్యర్థన మేరకు విశాఖలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రికి తరలించామన్నారు. కటక్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక అధికారుల బృందం, ప్రభావిత ప్రాంతంలోని ప్రతి ఆస్పత్రిలో ఆంధ్రా అధికారులు సేవల్లో ఉంటారని తెలియజేశారు. 

సహాయక చర్యలు ముమ్మరం: మంత్రి రజిని
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లా­డారు. సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి 20 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సేవింగ్‌ అంబులెన్సులు, 21 మహాప్రస్థానం వాహనాలను పంపామన్నారు.

ఈ వాహ­నాలను సమన్వయం చేసుకునేందుకు వైద్యం, రవాణా, పోలీసుశాఖల నుంచి ముగ్గురు అధికారులను నియ­మిం­చా­మని చెప్పారు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖ­పట్నం కేజీహెచ్, విజయ­నగరం జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే ఒడిశాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా వైద్య సేవలు అందించాలని చెప్పామని తెలిపారు. కాగా, రైలు ప్రమాదంపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు
0891–2590100, 0891 2590102, 9154405292 (వాట్సాప్‌ నంబర్‌)  
తాడేపల్లిలోని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్‌ 
సెంటర్‌లో కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు
1070, 112, 18004250101, 8333905022 (వాట్సప్‌)   

మరిన్ని వార్తలు