ధాన్యం రైతు 'ధర'హాసం

6 Jun, 2021 03:08 IST|Sakshi

రబీ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు భారీగా కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే 2,11,320 మంది రైతుల నుంచి 24,14,969.28 టన్నులు కొనుగోలు 

ఈ ధాన్యం విలువ రూ.4,521.08 కోట్లు 

ఆర్బీకేల ద్వారా కళ్లం వద్దే కొనుగోలు.. రైతులకు రవాణా ఖర్చు ఆదా 

21 రోజుల్లోగా ఖాతాల్లో డబ్బులు జమ.. తద్వారా కొనుగోళ్లు మరింత వేగవంతం  

బహిరంగ మార్కెట్లోనూ కనీస మద్దతు ధర

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యాన్ని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) భారీగా కొనుగోలు చేస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఉన్న ఊళ్లోనే ధాన్యాన్ని అమ్ముకోగలుగుతున్నారు. తద్వారా రవాణా ఖర్చు ఆదా అవుతోంది. ప్రస్తుత రబీలో ధాన్యాన్ని విక్రయించేందుకు ఆర్బీకేల ద్వారా 3.55 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. శనివారం నాటికి 2,11,320 మంది రైతుల నుంచి రూ.4,521.08 కోట్ల విలువైన 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ పంట కోతలు పూర్తయ్యాయి. దాంతో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధిక భాగం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నెల్లూరు, ప్రకాశం.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పంట కోతలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రాంతాల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే కొనుగోలు చేయడమే కాకుండా 21 రోజుల్లోగా అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. ప్రభుత్వమే భారీ ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లోనూ అదే ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 24,14,969.28 టన్నులు కొనుగోలు 
► రబీలో రైతులు 21.75 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. దిగుబడి అయిన ధాన్నాన్ని వీలైనంతంగా  కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే  24,14,969.28 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. 
► ప్రభుత్వం ధాన్యం క్వింటాలుకు సాధారణ రకానికి రూ.1868, ఏ–గ్రేడ్‌ రకానికి రూ.1888 ఎమ్మెస్పీగా ప్రకటించి, అదే ధరకు కొనుగోలు చేస్తోంది. రైతుల కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. దాంతో గ్రామాల్లోని 7,706 ఆర్బీకేలతో పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని 3,936 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేశారు. 
► ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తమ పేర్లను ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల్లో నమోదు చేయించుకోవాలి. ఈ–పంటలో ఆ రైతులు వరి సాగు చేశారా లేదా అన్నది సరి చూసుకుని, కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలుకు కూపన్లు జారీ చేస్తారు. ఏ రోజున ఏ సమయంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారన్నది ఆ కూపన్లలో స్పష్టంగా ఉంటుంది.  
► ఆ మేరకు ఆర్బీకేలోని వీఏఏ (గ్రామ వ్యవసాయ సహాయకుడు) కళ్లం వద్దకు వెళ్లి ధాన్యం నాణ్యతను పరిశీలించి, కొనుగోలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారు. ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) ప్రమాణాల మేరకు నాణ్యత లేకపోతే.. ధాన్యంలో తేమ శాతం తగ్గే వరకు అరబెట్టాలని వీఏఏ సూచిస్తారు. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.  

గిట్టుబాటుధర దక్కకపోతే అమ్ముకోవద్దు 
బహిరంగ మార్కెట్లో కనీస మద్ధతు ధర దక్కకుంటే ధాన్యాన్ని అమ్ముకోవద్దు. ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోండి. కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేయడానికి కూపన్లు జారీ చేస్తాం. కూపన్లలో పేర్కొన్న రోజున ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు రాకపోతే.. మరో కూపన్‌ జారీ చేసి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. మిల్లర్లు, దళారీలకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు. 
– కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ 

రైతులకు అన్ని విధాలా భరోసా 
► దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పంటల సాగులో సూచనలు, సలహాలు ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది.  
► అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల పంటకు నష్టం వాటిల్లితే బీమా పథకం ద్వారా పరిహారం అందజేస్తూ రైతులకు బాసటగా నిలుస్తోంది. తుదకు పండించిన పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. 

మరిన్ని వార్తలు