భావి తరాలకు పదిలంగా..! 

6 Jun, 2022 04:28 IST|Sakshi

గిరిజన సంస్కృతి సంరక్షణకు నడుం బిగించిన ప్రభుత్వం

వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలపై వీడియో డాక్యుమెంటేషన్‌

గిరిజనుల జీవనశైలిపై ప్రదర్శన శాలల ఏర్పాటు

ప్రతి ఏటా గిరిజన దినోత్సవం, ఉత్సవాల నిర్వహణ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరానికి అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గిరిజన తెగల సంస్కృతి, భాషల అధ్యయనం విస్తృతంగా సాగుతోంది. గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను వీడియో డాక్యుమెంటేషన్‌ చేసి విస్తృత ప్రచారం కల్పించేందుకు గట్టి ప్రయత్నం జరుగుతోంది.

గిరిజనుల వారసత్వాన్ని పరిరక్షిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని రాబోయే తరాలకు తెలియజేయడం కోసం గిరిజన వస్తు ప్రదర్శనశాలలు(మ్యూజియం)ను ఏర్పాటు చేసింది. అరకులోయ, శ్రీశైలం, సీతంపేట(శ్రీకాకుళం జిల్లా)లో గిరిజన వస్తు ప్రదర్శనశాలలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. షెడ్యూల్డ్‌ తెగలకు సంబంధించిన సాహిత్యం, వాజ్ఞయాలతో కూడిన 15 వేలకు పైగా పుస్తకాలను రూపొందించడంతోపాటు, వాటిలోని చాలా వరకు డిజిటలైజేషన్‌ చేసింది.

గ్లోబలైజేషన్‌ యుగంలో వివిధ గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన చర్చాగోష్టిలో సమర్పించిన పత్రాలను నాలుగు సంపుటాలుగా వెలువరించింది. గిరిజన బడుల్లో 1 నుంచి 3వ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకుంది. కోయ, ఆదివాసి, సుగాలి, కొండ, సవరా, భారతి, కువి, భాషల్లో 54 వాచకాలు రూపొందించి గిరిజన విద్యార్థులకు అందించింది.

బడగ, గదబ, కొండకాపు, గౌడు, కొఠియా, రోనా, భిల్లు, పరంగి పోర్జా, పోర్జా, మాలి, ధూలియా, కట్టునాయకన్, యానాది వంటి గిరిజన తెగలకు చెందిన వారి సంస్కృతి భాష, ఇతర సంప్రదాయాలపై సమగ్ర అధ్యయనాలను చేపట్టింది. కొండరెడ్డి, కోండ్, గదబ, చెంచు, కొరజ, సవర, జాతాపు, నక్కల, కోయ, వాల్మీకి తెగల ఆచార వ్యవహారాలను సంస్కృతిని సంప్రదాయక పరిజ్ఞానాన్ని పరిరక్షించడం కోసం వారి జీవన శైలిని వీడియో రూపంలో డాక్యుమెంటేషన్‌ చేయడం విశేషం.  

ఏటా గిరిజనోత్సవాలు
గిరిజన సంస్కృతిని వెలుగులోకి తేవడంతోపాటు గిరిజన స్వాతంత్య్ర పోరాటాలను స్మరించుకోవడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా గిరిజనోత్సవాలను నిర్వహిస్తోంది. అలాగే ప్రతి ఏడాది మే నెలలో మోదకొండమ్మ జాతర, జూలై 4న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, ఆగస్ట్‌ 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహిస్తోంది.

గిరిజన కళలను ప్రోత్సహించేందుకు అనేక పోటీలు, ఔత్సాహిక కార్యక్రమాలను చేపడుతోంది. గిరిజన నాట్య బృందాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే గిరిజన ఉత్సవాల్లో పోటీలకు పంపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయపూర్‌లో 2019లో జరిగిన జాతీయ గిరిజన నృత్యోత్సవంలో రాష్ట్రానికి చెందిన ‘కొండరెడ్ల కొమ్ము’ నాట్యానికి 3వ బహుమతి వచ్చింది.  

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం.. 
సీఎం జగన్‌ ఆదేశాలతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాం. గిరిజన తెగలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాం.

గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, వేషభాషలు, సంగీత, నాట్య పరికరాలు, వ్యవసాయ పరికరాలు, కళలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సేకరించి మ్యూజియంలతోపాటు, వీడియోలు, ఫొటోలు, డిజిటలైజేషన్‌ తదితర రూపాల్లో అందుబాటులోకి తెస్తున్నాం. మరింత పరిజ్ఞానం తెలుసుకునేలా అధ్యయనం చేపట్టడంతోపాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాం. 
    – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి  

మరిన్ని వార్తలు