ఇక చకచకా లీజులు

2 Oct, 2022 04:28 IST|Sakshi

గ్రానైట్‌ ఈ–వేలానికి హైకోర్టు సమర్థనతో 500కి పైగా గ్రానైట్‌ లీజులిచ్చే అవకాశం

అన్ని ఖనిజాలు కలిపి 1,000 క్వారీలకు అనుమతులు

కొత్త విధానం ద్వారా ఎవరైనా లీజులు పొందే అవకాశం

అక్రమాలకు, ఆలస్యానికి తావు లేకుండా నిబంధనలు

ప్రభుత్వ ఆదాయం రూ.500 కోట్లు పెరుగుతుందని అంచనా

సాక్షి, అమరావతి: గ్రానైట్‌ లీజుల ఈ–వేలానికి అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 500కిపైగా గ్రానైట్‌ గనులకు ఈ–వేలం నిర్వహించనుంది. మైనింగ్‌ నిబంధనలు సరళతరం చేస్తూ ప్రభుత్వం ఇటీవల  కొత్తగా పారదర్శక విధానాన్ని తీసుకువచ్చింది. ఎలక్ట్రానిక్‌ వేలం (ఈ–ఆక్షన్‌) ద్వారా రాష్ట్రంలోని ఖనిజ వనరుల మైనింగ్‌ కోసం ఉత్సాహం ఉన్న ఎవరైనా లీజులు పొందే అవకాశం కల్పించింది. నూతన విధానం ద్వారా తొలి దశలో 234 ఖనిజాల లీజుకు గనుల శాఖ ప్రభుత్వం ఇంతకు ముందే జిల్లాలవారీగా టెండర్లు పిలిచింది.

అందులో 169 కలర్‌ గ్రానైట్‌వే. కానీ ఈ–వేలం నిర్వహించవద్దని గ్రానైట్‌ అసోసియేషన్‌ హై కోర్టుకు వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వ విధానం సరైనదేనని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో గ్రానైట్‌ లీజుల వేలానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తొలి దశలో 200 గ్రానైట్‌ గనుల లీజుకు ఈ–వేలం నిర్వహించనున్నారు. 6 నెలల్లో వివిధ రకాల ఖనిజాలకు చెందిన వెయ్యి క్వారీల లీజులకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో గ్రానైట్‌వే సగం ఉన్నాయి. ఈ వెయ్యి లీజుల ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ.500 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తెలిపారు.

గుత్తాధిపత్యానికి చెక్‌ 
గతంలో మైనింగ్‌ రంగంలో గుత్తాధిపత్యం ఉండేది. పలుకుబడి కలిగిన వ్యక్తులే క్వారీలను శాసించేవారు. కొత్తవారికి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. 55 ఏళ్ల క్రితం రూపొందించిన ఈ విధానంలో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి లీజులు కేటాయించేవారు. పైగా, లీజుకు తీసుకున్నప్పటికీ, వాటికి అనుమతులు తీసుకొనేవారు కాదు. లీజు దరఖాస్తుల నుంచి క్వారీయింగ్‌ ప్రారంభం వరకు అనేక అవకతవకలు జరిగేవి. పదేళ్లు, ఇరవై ఏళ్లకు కూడా తవ్వకాలు మొదలయ్యేవి కావు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడేది.

గతంలో ఖనిజ వనరులను గుర్తించడం, వాటికి ఎన్‌వోసీల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, తర్వాత లీజులు తెచ్చుకోవడం ఒక ప్రహసనంలా ఉండేది. అనుమతులకూ పారదర్శక విధానం లేకపోవడంతో ఇబ్బందులు నెలకొనేవి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి అక్రమాలకు, ఆలస్యానికి తావు లేకుండా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ముందుగా వచ్చిన వారికే లీజుల విధానాన్ని రద్దు చేసింది.

రాష్ట్రంలో  ఖనిజ వనరులను గనుల శాఖ ద్వారా గుర్తించి, వాటిలో క్వారీయింగ్‌ చేసే ఉత్సాహం ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఈ–వేలం విధానాన్ని తెచ్చింది. దీనివల్ల ఎవరైనా సులువుగా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఇప్పటికే గనుల లీజు పొంది క్వారీయింగ్‌ చేస్తున్న వారు, పట్టా భూముల్లో క్వారీయింగ్‌ చేస్తున్న వారు, అటవీ భూముల్లో లీజు పొందిన వారి ప్రయోజనాలను కూడా కాపాడుతూ కొత్త విధానాన్ని తెచ్చింది.

ప్రస్తుతం క్వారీయింగ్‌ చేస్తున్న వారికి వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం కల్పించింది. లీజు గడువు ముగిసిన తరువాత ఆ ప్రాంతాల్లో రెవెన్యూ భూముల్లో ఖనిజాలకు వేలంలో ఎంత విలువ నిర్ధారణ అవుతుందో దానిని చెల్లిస్తే, వారికే లీజు అనుమతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది.  

మరిన్ని వార్తలు