ఆదాయం లేని ఆలయాలకు ఊరట

21 Jun, 2022 05:53 IST|Sakshi

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న గుళ్లకు ఫీజుల మినహాయింపు 

ఇప్పటివరకు రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న వాటికే వర్తింపు 

తాజా నిర్ణయంతో 1,254 ఆలయాలకు ప్రయోజనం

వీటికి ఏటా తగ్గనున్న భారం సుమారు రూ.7.31 కోట్లు

దేవదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కమిషనర్‌ 

సాక్షి, అమరావతి: ఆదాయం తక్కువ ఉండే ఆలయాలపై అదనపు భారాలు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే గుళ్లు, ఇతర హిందూ ధార్మికసంస్థలు చట్టబద్ధంగా దేవదాయ శాఖకు చెల్లించాల్సిన వివిధ రకాల ఫీజుల నుంచి మినహాయింపునిచ్చింది. ఇందుకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ సోమవారం జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లు, రీజనల్‌ జాయింట్‌ కమిషనర్లకు సూచనలు జారీచేశారు.

అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. కమిషనర్‌ ముందుగానే ఆయా ఆలయాల నుంచి ఆ తరహా ఫీజులను వసూలు చేయవద్దని సూచిస్తూ మెసేజ్‌ ఆదేశాలు జారీచేశారు. దేవదాయ శాఖ చట్టం ప్రకారం.. ఎన్నో ఏళ్ల నుంచి రాష్ట్రంలో రూ.రెండులక్షలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలు ఏటా కొంత మొత్తం దేవదాయ శాఖకు చెల్లించాలి. ఆదాయం తక్కువ ఉండే పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌)కు ప్రతి ఆలయం తమ నికర ఆదాయంలో తొమ్మిది శాతం చొప్పున చెల్లించాలి.

దేవదాయ శాఖ నిర్వహణ నిధికి మరో ఎనిమిది శాతం, ఆడిట్‌ ఫీజుగా 1.5 శాతం చొప్పున చెల్లించాలి. ఇటీవల రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను ఈ తరహా ఫీజులు వసూలు నుంచి మినహాయించే విషయం పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు సూచనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఫీజు మినహాయింపునకు ఆదాయ  పరిమితిని ఏటా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచింది. 

95 శాతం ఆలయాల ఆదాయం రూ.ఐదులక్షల లోపే..
రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో మొత్తం 24,699 గుళ్లు, ఇతర హిందూ ధార్మికసంస్థలు ఉన్నాయి. వీటిలో ఏటా రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలు 23,465 ఉన్నాయి. అంటే దేవదాయ శాఖ పరిధిలోని మొత్తం గుళ్లలో ఏటా రూ.ఐదులక్షల లోపు నికర ఆదాయం ఉండే ఆలయాలే 95 శాతం. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉన్న వాటిలో 4,131 ఆలయాలు మాత్రమే దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారుల (ఈవోల) పర్యవేక్షణలో ఉన్నాయి. ఫీజు మినహాయింపునకు ఆదాయ పరిమితి పెంపుతో కొత్తగా 1,254 ఆలయాలకు లబ్ధికలుగుతుందని అధికారులు తెలిపారు.  ఈ ఆలయాలు ఏటా రూ.7.31 కోట్ల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉందని వెల్లడించారు.  

అర్చకుల జీతభత్యాలకు వెసులుబాటు..
రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ చట్టబద్ధంగా చెల్లించాల్సిన ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకుల జీతాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం అమలుకు కృషిచేస్తున్న అందరికీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు