వాస్తవ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా..  విశాఖలో గ్లోబల్‌ సమ్మిట్‌

9 Nov, 2022 03:20 IST|Sakshi
విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023 లోగోను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మార్చి 3, 4 తేదీల్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు– 2023

సమ్మిట్‌ లోగోను విడుదల చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

గత సర్కారు తరహాలో ఉత్తుత్తి ఒప్పందాలు ఉండవు: మంత్రి అమర్‌నాథ్‌

అగ్రి, ఫుడ్‌ ప్రాసెసింగ్, రక్షణ, ఏరోస్పేస్, మెరైన్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్, టూరిజం, గ్రీన్‌ ఎనర్జీ తదితర రంగాలపై దృష్టి

సదస్సు విజయవంతం అయ్యేలా అంతర్జాతీయంగా రోడ్‌షోలు

2024 జనవరి నాటికి రామాయపట్నానికి మొదటి నౌకను తీసుకొస్తాం

సాక్షి, అమరావతి: వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు– 2023ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్‌ కారణంగా రెండేళ్ల నుంచి ఎటువంటి పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేకపోయామని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహిస్తున్న తొలి సదస్సు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ పేర్కొన్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 వివరాలను తెలియజేయడానికి మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు భిన్నంగా దీనిని నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని, కానీ వాస్తవ రూపంలోకి వచ్చింది రూ.40,000 కోట్లే అని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి లక్ష్యాలు లేకుండా, వాస్తవంగా రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు సంబంధించి మాత్రమే ఒప్పందం చేసుకుంటామన్నారు.

అంతకుముందు సీఎం క్యాంపు కార్యాలయంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ 2023 లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్‌ షన్‌మోహన్, ఏపీఎంఎస్‌ఎంఈ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్‌ కె రవిచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు ఎల్‌ శ్రీధర్, ఏపీఐడీసీ చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చైర్మన్‌ ఎస్‌ నీరజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రోడ్‌షోలు
రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించుకుంటూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించే విధంగా త్వరలో దేశ, విదేశాల్లో రోడ్‌షోలను నిర్వహించనున్నట్లు మంత్రి అమరనాథ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో విజయవంతంగా పరిశ్రమలు నడుపుతున్న వారు చెబుతున్న అభిప్రాయాలనే బ్రాండింగ్‌గా వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్, రక్షణ, ఎరోస్పేస్, మెరైన్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, టూరిజం, గ్రీన్‌ ఎనర్జీ, ఎంఎస్‌ఎంఈ, ఫుట్‌వేర్, పోర్టు ఆధారిత పరిశ్రమలు వంటి రంగాలపై దృష్టి సారిస్తామన్నారు.

ఇజ్రాయిల్, తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో రోడ్‌షోలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులను ఆకర్షించే విధంగా దేశ వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో కూడా రోడ్‌షోలను నిర్వహించన్నుట్లు తెలిపారు. ఈ ఇన్వెస్టర్‌ మీట్‌కు అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తామన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిలో భాగంగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2024 జనవరి నాటికి రామయపట్నం పోర్టుకు తొలి నౌకను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాలతో పోటీ పడి.. దక్కించుకున బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ద్వారా రూ.40,000 కోట్ల పెట్టుబడులు, 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందన్నారు. దావోస్‌ సదస్సులో గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.1.26 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగితే, అప్పుడే అందులో రూ.40,000 కోట్లు వాస్తవ రూపంలోకి వచ్చాయన్నారు. 

మరిన్ని వార్తలు