వివాదాస్పద భూమినే.. వివాద రిజిస్టర్‌లో ఉంచాలి 

7 Dec, 2022 03:50 IST|Sakshi

ఆ సర్వే నంబర్‌ మొత్తాన్ని నమోదు చేయొద్దు 

దీన్ని పక్కాగా అమలు చేయండి 

రెవెన్యూ శాఖకు ప్రభుత్వం ఆదేశం 

సాక్షి, అమరావతి: ఏదైనా భూమికి సంబంధించి వివాదం తలెత్తితే.. ఆ భూమిని మాత్రమే వివాద రిజిస్టర్‌లో ఉంచాలని రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి సంబంధించిన సర్వే నంబర్‌ మొ­త్తాన్ని వివాద రిజిస్టర్‌లో నమోదు చేయొ­ద్దని ఆదేశించింది. ఉదాహరణకు ఒక సర్వే నంబర్‌లో 10 ఎకరాల భూమి ముగ్గురి పేరు మీద ఉండి.. వారు సబ్‌ డివిజన్‌ చేసుకోకుండా దాన్ని సాగు చేస్తున్నారనుకుందాం.

వారిలో ఒకరి పేరు మీద ఉన్న భూమిపై వివాదం ఏర్పడితే మొత్తం ఆ సర్వే నంబర్‌ అంతటినీ వెబ్‌ల్యాండ్‌లోని వివాద రిజిస్టర్‌లో పెడుతున్నారు. దీంతో వివాదం లేని ఇద్దరి భూమి కూడా వివాదంలోకి వెళ్తోంది. గ్రామాల్లో ఇలాంటి కేసులు చాలా ఉండడంతో రైతులు, భూ యజమానుల నుంచి ఎన్నో ఏళ్లుగా ఆందోళన వ్యక్తమవుతోంది. రీ సర్వే జరుగుతున్న క్రమంలోనూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

వాటాల పంపకాలు, అమ్మకాలు, కొనుగోళ్ల తర్వాత సబ్‌ డివిజన్‌ చేసుకోకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సబ్‌ డివిజన్‌ జరగకుండా ఉన్న భూమికి సంబంధించి.. వివాదం ఏర్పడిన భూమి పోర్షన్‌ వరకే వివాద రిజిస్టర్‌లో చేర్చాలని, డిజిటల్‌ సిగ్నేచర్‌ తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇప్పటికే మొత్తం సర్వే నంబర్‌ను వివాద రిజిస్టర్‌లో పెట్టిన కేసులపై తహశీల్దార్లు వెంటనే స్పందించి.. పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. కలెక్టర్లు కూడా దీనిపై ఆర్డీఓలు, తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చి అమలయ్యేలా చూడాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.  

మరిన్ని వార్తలు