ఆత్మ గౌరవంతో ‘లక్ష’ణంగా..!

26 Apr, 2023 03:12 IST|Sakshi
కావలిలో నిర్మించిన టిడ్కో ఇళ్లు

జూన్‌ నాటికి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ

అన్ని సదుపాయాలతో ముస్తాబైన పేదల ఇళ్లు

ఇప్పటికే 48 వేలకు పైగా గృహ ప్రవేశాలు

రెండో విడతలో మరో 40 వేలకుపైగా..

28న కావలి నుంచి ప్రారంభం.. పేదలకు 2,112 టిడ్కో ఇళ్లు

29న శ్రీకాకుళంలో మరో 1,280 యూనిట్ల పంపిణీ

సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్లు సిద్ధం

గృహ శోభతో సందడిగా పట్టణాలు

సాక్షి, అమరావతి: పట్టణ పేదలు ఆత్మ గౌరవంతో సగర్వంగా జీవించేలా తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మొదటి విడతగా ఇప్పటికే 48,416 టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రెండో దఫాలో మరో 40 వేలకు పైగా యూనిట్లను పట్టణ పేదలకు అందచేసేందుకు సిద్ధమైంది. జూన్‌ నాటికి మొత్తం లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించారు.

దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో భారంగా గడిపిన బడుగు జీవులు అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో గృహాలకు యజమానులుగా మారుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కావలి నుంచి మొదలయ్యే టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ జూన్‌ చివరి వరకు కొనసాగనుంది. కావలి మున్సిపాలిటీలో అన్ని వసతులతో పూర్తి చేసిన 2,112 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నెల 29వతేదీన శ్రీకాకుళంలో 1,280 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 

సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్లు
సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్ల టిడ్కో ఇళ్ల పంపిణీ మే నెల మొదటి వారంలో మొదలు కానుంది. మే రెండో వారంలో పొన్నూరు, గుంటూరు యూఎల్బీలోని వెంగళాయపాలెం, అడవి తక్కెళ్లపాడుతోపాటు ఆళ్లగడ్డ, డోన్, విశాఖపట్నం, గుడివాడ, మచిలీపట్నం, పిఠాపురం, యలమంచిలి, కందుకూరు యూఎల్బీల్లో ఇళ్లను అందజేయనున్నారు. గుడివాడలో భారీ స్థాయిలో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. 

అనకాపల్లి యూఎల్బీలో..
అనకాపల్లి యూఎల్బీలో జూన్‌ మొదటి వారంలో టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నారు. సత్యనారాయణపురం(అనకాపల్లి)లో 3,256 యూనిట్లు, చిత్తూరులో 2,832, పుంగనూరులో 1,536, నరసరావుపేటలో 1,504 యూనిట్లను లబ్ధిదారులకు అందచేస్తారు.

రిజిస్ట్రేషన్లు సైతం ఉచితంగానే..
మున్సిపాలిటీల పరిధిలో నివసించే నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు అనువుగా జీ+3 అంతస్తుల్లో 300, 365, 430 చ.అడుగుల్లో టిడ్కో ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తోంది. లబ్ధిదారులపై ఏమాత్రం భారం పడకుండా వారి పేరిట ఉచితంగానే రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈమేరకు నివాస ప్రాంగణాల్లో అన్ని వసతులు కల్పించిన అనంతరం లబ్ధిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి పూర్తి హక్కు పత్రాలు, ఇంటి తాళాలను అధికారులు అందజేస్తున్నారు.

ఈ దఫాలో 17 ప్రాంతాల్లో మొత్తం 40,728 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 88 యూఎల్బీల్లో 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 24 ప్రాంతాల్లో నూరు శాతం ఇళ్ల పంపిణీ పూర్తైంది. కావలి, పాత్రునివలస (శ్రీకాకుళం)లో కూడా శుక్ర, శనివారాల్లో నూరు శాతం పంపిణీ పూర్తవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్‌ తెలిపారు. 

పేదల ఆత్మ గౌరవాన్ని పెంచారు 
రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లంటూ లేని నిరుపేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 21.25 లక్షల గృహాలను నిర్మిస్తున్నారు. ఈ స్థాయిలో ఇళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరు. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తూ పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు.

దేశవ్యాప్తంగా హౌసింగ్‌ విధానాలపై ఇటీవల కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో అంధ్రప్రదేశ్‌లోని టిడ్కో హౌసింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇది సీఎం జగన్‌ చొరవ వల్లే సాధ్యమైంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు జూన్‌ నాటికి లక్ష టిడ్కో ఇళ్లు ఇస్తాం. శుక్రవారం నుంచి మలి విడతగా 40,728 ఇళ్లు పంపిణీ చేయనున్నాం. 
– జమ్మాన ప్రసన్న కుమార్, టిడ్కో చైర్మన్‌

మరిన్ని వార్తలు