వెదురు.. రాబడికి ఉండదు బెదురు

22 May, 2022 04:34 IST|Sakshi

ఒక్కసారి నాటితే 70 ఏళ్ల పంట

నాలుగేళ్ల తర్వాత ఏటా 25–30 టన్నుల దిగుబడి

సిద్ధమవుతున్న యాక్షన్‌ ప్లాన్‌

జూలై నుంచి అమలుకు సన్నాహాలు

ప్రైవేటు భూముల్లో 50%, ప్రభుత్వ భూముల్లో 100% సబ్సిడీ

సాక్షి, అమరావతి: వెదురు.. సహజసిద్ధమైన ప్రకృతి వనరు. పేదవాడి కలపగా, పచ్చబంగారంగా పిలుచుకునే సిరుల పంట. ఇతర మొక్కలతో పోలిస్తే 35 శాతం అధికంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగలిగే సత్తా దీని సొంతం. ప్రస్తుతం అటవీ ప్రాంతానికే పరిమితమైన వెదురు పంటను మైదాన ప్రాంతాల్లోనూ సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

70 ఏళ్ల వరకు దిగుబడి
వెదురు అన్ని నేలలకు అనువైనది. నీటి సౌకర్యం ఎక్కువగా ఉండాలి. ఒకసారి నాటితే 70 ఏళ్లపాటు నిరంతరాయంగా దిగుబడి లభిస్తుంది. 50 నుంచి 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. రకాలను బట్టి నాటిన మూడు, నాలుగేళ్ల నుంచి ఏటా 25–30 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. తొలి ఏడాది ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.

ఆ తర్వాత ఏటా ఎకరాకు రూ.10 వేల ఖర్చు చేస్తే చాలు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుంది. వెదురులో 140కు పైగా రకాలున్నప్పటికీ  మన ప్రాంతానికి అనువైనవి, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నవి 14 రకాలే. వెదురు సాగును ప్రోత్సహిస్తే భూమి సారవంతమవుతుంది. సాగులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. లంక, బీడు భూములతో పాటు పొలం గట్లు, పండ్ల తోటల చుట్టూ కంచె రూపంలో సాగు చేస్తే పంటలకు రక్షణతో పాటు రాబడికి ఢోకా ఉండదు. 

యాక్షన్‌ ప్లాన్‌ ఇలా.. 
అటవీ శాఖ అధీనంలో ఉండే వెదురు మిషన్‌ను ప్రభుత్వం ఇటీవలే ఉద్యాన శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, అటవీ, పర్యావరణ, పరిశ్రమల విభాగాల కార్యదర్శులు, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ సభ్యులుగా ఉంటారు.

వెదురు కార్పొరేషన్‌ చైర్మన్, వెదురు సాగుచేసే  రైతులను కమిటీలో ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. ఆర్బీకేల ద్వారా జిల్లాల వారీగా వెదురు సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. కనీసం మూడేళ్ల పాటు సాగు విస్తరణను ప్రోత్సహిస్తారు. తొలి ఏడాది 500 హెక్టార్లు ఆత ర్వాత ఏటా 1,500 నుంచి 2వేల హెక్టార్ల చొప్పున విస్తరించాలని సంకల్పించారు. 

సబ్సిడీ ఇలా..
నాటిన తర్వాత ఒక్కో మొక్కకు మూడేళ్లపాటు రూ.240 వరకు ఖర్చవుతుంది. ప్రైవేటు భూముల్లో సాగు చేసే వారికి 50 శాతం, ప్రభుత్వ భూముల్లో నాటితే 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ మొత్తంలో తొలి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 30 శాతం, మూడో ఏడాది 20 శాతం చొప్పున అందిస్తారు. పంట పొలాలు, పండ్ల తోటలు, ఆక్వా చెరువుల చుట్టూ కంచె రూపంలో వెదురు మొక్కలు వేసినా పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన సబ్సిడీని అందిస్తారు.

రూ.7.5 లక్షలతో చిన్న నర్సరీలు, రూ.15 లక్షలతో పెద్ద నర్సరీలు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 40 శాతం సబ్సిడీ అందిస్తారు. ఇక ప్రాసెసింగ్‌ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. ఫర్నిచర్, వెదురు ఉప ఉత్పత్తులను అమ్ముకునే వారికి సైతం 50 శాతం సబ్సిడీతో చేయూత ఇస్తారు. ఇలా విత్తు నుంచి విక్రయం వరకు చేయూత అందించేలా రూ.10కోట్ల అంచనాతో యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. జూలై నుంచి అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఎరువు అవసరం లేదు
రెండేళ్ల క్రితం హోసూరు నుంచి  టిష్యూకల్చర్‌ భీమ వెదురు మొక్కలు తెచ్చి పెదకూరపాడు మండలం గారపాడులోని రెండెకరాల్లో నాటాను. ఎరువు వేయలేదు. డ్రిప్‌తో నీరందిస్తున్నా. ప్రస్తుతం గెడలు 15 అడుగులు పెరిగాయి. మూడేళ్ల తర్వాత మంచి దిగుబడి వస్తుంది.    
– వి.వెంకటేశ్వర్లు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా

యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం
రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. జూలై నుంచే అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. లంక భూముల కోతను వెదురు సాగుతో  కట్టడి చేయొచ్చు.
– ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైస్‌ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్‌  

మరిన్ని వార్తలు