జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా'

10 Oct, 2022 04:17 IST|Sakshi

చిన్నపాటి లోపాలు సైతం లేకుండా పకడ్బందీగా పథకం అమలు

పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయ సేకరణ

నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అన్ని వస్తువులు ఉండేలా జాగ్రత్తలు.. 2023–24 నుంచి ప్రతి విద్యార్థికీ సరిపడేలా అదనపు యూనిఫాం క్లాత్‌

లావుగా ఉన్న పిల్లలకు కూడా క్లాత్‌ సరిపోయేలా చర్యలు 

కుట్టు కూలీ ధర పెంపుపై పరిశీలన.. బ్యాగుల్లో మార్పులు

1–5 తరగతులకు మీడియం సైజ్‌ బ్యాగ్‌.. 6–10 తరగతులకు పెద్ద సైజ్‌.. నోట్‌బుక్‌లు, పాఠ్య పుస్తకాలు అన్నీ అమరే విధంగా వెడల్పాటి బ్యాగ్‌ 

షూ సైజులు తీసుకోవడానికి మండల స్థాయిలో సరఫరాదారులతో మేళాలు 

వచ్చే ఏడాది పంపిణీకి ఇప్పటి నుంచే విద్యా శాఖ సన్నాహాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్ణీత ప్రమాణాలకు ఎక్కడా తగ్గకుండా వస్తువులను పంపిణీ చేయించేలా పాఠశాల విద్యా శాఖ దృష్టి సారించింది. జగనన్న విద్యా కానుక వస్తువులకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది.

అక్కడక్కడ తలెత్తిన చిన్న చిన్న లోపాలు కూడా భవిష్యత్తులో ఉండకుండా చూసుకోవాలని నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ మరింత నాణ్యమైన వస్తువుల పంపిణీకి ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టింది. 

ఏటేటా పెరుగుతున్న నాణ్యత 
► గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫారం మాత్రమే ఇచ్చేవారు. అదీ విద్యా సంవత్సరం ఆరంభమై ఏడెనిమిది నెలలు గడిచినా అందేవి కావు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారం అందించేలా చర్యలు తీసుకున్నారు. కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారంతో పాటు నోట్సులు, వర్కు బుక్కులు, షూలు, సాక్సులు, బెల్టులు, బ్యాగులు అందించేలా జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టారు.

► రెండు జతల యూనిఫారం కాకుండా మూడు జతలు అందిస్తున్నారు. దీనికి అదనంగా విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీలను పంపిణీ చేయిస్తున్నారు. 2020–21లో 42,34,322 మంది విద్యార్థులకు రూ.648.10 కోట్లతో, 2021–22లో 45,71,051 మందికి రూ.789.21 కోట్లతో, 2022–23లో 4,740,421 మందికి రూ.931.02 కోట్లతో జగనన్న విద్యా కానుకను అందించారు. మూడేళ్లలో ఈ వస్తువుల కోసం రూ. 2,368.33 కోట్లు వెచ్చించారు.

► అయితే వేలాది స్కూళ్లలో లక్షలాది మంది విద్యార్థులకు పంపిణీకి సంబంధించిన కార్యక్రమం కావడంతో క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు తలెత్తడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు విద్యా శాఖ అధికారులు పరిష్కరిస్తున్నారు. మౌలికమైన అంశాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటినీ పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు.

► ఇలా ఏటేటా ఈ పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తాజాగా వారి నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇకపై మరింత నాణ్యమైన వస్తువులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇకపై మార్పులు ఇలా..
► అన్ని ఊళ్లలో ఒక్కో తరగతిలో ఒకరో ఇద్దరో పిల్లలు లావుగా ఉండొచ్చు. వారికి యూనిఫాం క్లాత్‌ సరిపోకపోయి ఉండొచ్చు. ఇకపై ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ సరిపడా రీతిలో మూడు జతల యూనిఫారం క్లాత్‌ ఇచ్చేందుకు చర్యలు. 

► కుట్టు కూలీ మరింత పెంచి ఇచ్చే విషయమూ విద్యా శాఖ పరిశీలన చేస్తోంది. 

► బ్యాగుల పరిమాణంపై నిపుణుల సూచనల మేరకు మార్పులు చేయిస్తోంది. 1–5 తరగతుల విద్యార్థులకు మీడియం సైజు, 6–10 తరగతుల విద్యార్థులకు పెద్ద సైజు బ్యాగులు అందించనున్నారు. ఈసారి బ్యాగు వెడల్పు పెంచనున్నారు. 

► బ్యాగులో నోట్‌బుక్కులు, పాఠ్య పుస్తకాలు అన్నీ పట్టేలా కొత్త టెండర్‌లో స్పెసిఫికేషన్లు సవరించనున్నారు.

► పిల్లల షూ సైజులను తీసుకొనేందుకు మండల స్థాయిలో ఆయా కంపెనీల ద్వారా షూ మేళాలు నిర్వహించేలా చేయడమో, లేదా కూపన్లు అందించి ఆయా కంపెనీల దుకాణాలలో వాటిని రీడీమ్‌ చేసుకొని షూలు పొందేలా చేయడమో చేయాలని ప్రతిపాదించారు. 

► విద్యా కానుక పంపిణీలో జాప్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేకుండా ఇప్పటి నుంచే విద్యా శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. బడ్జెట్‌ ఎస్టిమేట్లను త్వరగా పూర్తి చేసి ఆర్థిక అనుమతులు పొందడం, టెండర్‌ డాక్యుమెంట్లు ఫైనల్‌ చేయడం, టెండర్లను పిలవడం, కంపెనీల ఎంపిక, వర్కు ఆర్డర్ల జారీ, ఒప్పందాలు చేసుకోవడం వంటివి ఈ ఏడాది నవంబర్‌ చివరికల్లా ముగించాలని భావిస్తున్నారు.

► వచ్చే ఏడాది ఏప్రిల్‌ మొదటి వారానికి జిల్లా.. మండల స్థాయికి ఆయా వస్తువులను చేర్చడం. ఏప్రిల్‌ 15 నాటికి కిట్ల రూపంలో వాటిని సిద్ధం చేయడం. పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులందరికీ వాటిని పంపిణీ చేయించడం. వచ్చే ఏడాది విద్యా కానుక అమలు కోసం రూ.958.34 కోట్లు అవసరమవుతాయని విద్మాయ శాఖ అంచనా వేసింది.

తిరుపతికి చెందిన వంశీ అనే విద్యార్థి ఇప్పుడు ఆరవ తరగతి చదువుతున్నాడు. ఒబేసిటీ కారణంగా ఈ విద్యార్థిలావుగా ఉంటాడు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది ఇచ్చిన యూనిఫారంతో మూడు జతల డ్రస్‌ కుట్టించడం వీలు పడలేదు. రెండు జతలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉండొచ్చు. ఇలా ఒకరిద్దరికి క్లాత్‌ సరిపోనంత మాత్రాన.. అందరికీ సరిపోలేదని ప్రచారం చేసే ప్రబుద్ధులున్నారు. అందువల్ల ఇకపై ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు