మీ దస్తావేజు.. మీరే సొంతంగా..

27 Feb, 2023 03:04 IST|Sakshi

స్వయంగా తయారు చేసుకునేలా పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానం

త్వరలో అందుబాటులోకి తెస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ 

ఆన్‌లైన్‌లోనే స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌  

ఆ ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వేగంగా రిజిస్ట్రేషన్‌

సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా మారుస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ 

ప్రజలకు సమయం ఆదా, మధ్యవర్తుల ప్రమేయానికి తెర 

దస్తావేజుల్లో తప్పులు, అవకతవకలకు ఆస్కారం ఉండదు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధా­నం మరింత సులభతరం కానుంది. ఎవరి దస్తా­వే­జును వారే తయారు చేసుకునేలా రాష్ట్ర ప్రభు­త్వం త్వరలో పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వినియోగదారులు డాక్యుమెంట్‌ రైటర్లపై ఆధారపడాల్సి వస్తోంది.

వారి వద్ద దస్తావేజుల్లో తమ రిజిస్ట్రేషన్‌ వివరాలు (ఆస్తి వివరాలు, కొనుగోలుదారు, విక్రయదారు, ఆధార్‌ నెంబర్లు తదితరాలు) నమోదు చేసుకుని ప్రభుత్వానికి చలానాలు కూడా వారి ద్వారానే చెల్లించి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వస్తున్నారు. అక్కడ ఆ డాక్యు­మెంట్‌ను పరిశీలించి రిజిస్టర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో డాక్యుమెంట్‌ రైటర్ల ప్రమేయం అధికంగా ఉండడంతోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

ఈ ఇబ్బందులను అధిగమించేందుకు పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానం ఉపయోగపడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ సీఏఆర్‌డీ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మిని స్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌) డీఐజీ రవీంద్రనాథ్‌ వివరించారు. దీనివల్ల డాక్యుమెంట్‌ రైటర్ల వద్దకు వెళ్లకుండా ‘ఐజీఆర్‌ఎస్‌’ వెబ్‌సైట్‌లో స్వయంగా తమ డాక్యుమెంట్‌ తయారు చేసుకోవచ్చు. ఎవరి రిజిస్ట్రేషన్‌ డేటాను వారే ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. 

ఆన్‌లైన్‌లోనే స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపులు
రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ, యూజర్‌ చార్జీల చలానాలు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించే సౌలభ్యం కల్పించనున్నారు. ప్రస్తుతం ఇందుకు మూడు రకాల చలానాలు బ్యాంకులో కట్టాల్సి వస్తోంది. ఈ మూడింటిని కలిపి ఒకేసారి ఆన్‌లైన్‌లో చెల్లించే వీలు కల్పించనున్నారు. అనంతరం ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

స్లాట్‌ బుకింగ్, పేమెంట్‌ రశీదుతో జారీ చేసే యూనిక్‌ ఐడీతో నిర్దేశిత సమయానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళితే పరిశీలించి ఆధార్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. సంబంధిత వ్యక్తుల ఫొటోలు, వేలిముద్రలు తీసుకుని ఒరిజినల్‌ పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ కోసం 45 నిమిషాలు పడుతుండగా పబ్లిక్‌ డేటా ఎంట్రీ, ఆన్‌లైన్‌లోనే చెల్లింపుల ద్వారా 10 నిమిషాల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఒకవేళ డేటా ఎంట్రీ అనంతరం ఏమైనా సరిదిద్దుకోవాలన్నా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.  

నేరుగా వచ్చినా రిజిస్ట్రేషన్లు..  
డేటా ఎంట్రీ, స్లాట్‌ బుకింగ్‌ లేకుండా నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కా­­ర్యాలయానికి వచ్చే వారికి  కూడా రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వీరి డేటా ఎంట్రీని అక్కడి సిబ్బంది చేయాల్సి ఉంటుంది. ప్రస్తు­తం టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను పబ్లిక్‌ డేటా ఎంట్రీ ద్వారానే చేస్తున్నారు. ఈ డేటా ఎంట్రీని మున్సిపల్‌ శాఖ చేస్తున్నా అదే విధానంలో సాధారణ రిజిస్ట్రేష­న్లకు వర్తించేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నారు. వివా­హాల రి­జి­­స్ట్రేషన్లను కూడా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఇది మంచి ఫలి­తం ఇవ్వడంతో సాధారణ రిజిస్ట్రేషన్లకు వర్తింపచేస్తున్నారు.

పబ్లిక్‌ డేటా ఎంట్రీతో పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు
పబ్లిక్‌ డేటా ఎంట్రీ వల్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానం పారదర్శకంగా ఉంటుంది. ప్రజలు ఎక్కువ సమ­యం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. దళారుల ప్రమేయం, అవకతవకలకు ఆస్కారం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేయవచ్చు. త్వరలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తాం.  
– వి.రామకృష్ణ, కమిషనర్, ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 

మరిన్ని వార్తలు