బడి పిల్లలకు ‘టోఫెల్‌’ ట్రైనింగ్‌

8 Jun, 2023 04:24 IST|Sakshi

పాఠశాల దశలోనే నైపుణ్యాల పెంపుపై ప్రభుత్వం దృష్టి 

టోఫెల్‌ ప్రైమరీ, జూనియర్‌ పరీక్షలకు సిద్ధమయ్యేలా శిక్షణ 

ఈటీఎస్‌తో ఒప్పందాన్ని ఆమోదించిన మంత్రివర్గం  

12న జగనన్న విద్యాకానుక, 28 నుంచి అమ్మ ఒడి కార్యక్రమాలు  

మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడి

సాక్షి, అమరావతి: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందిస్తూ ‘టోఫెల్‌’ పరీక్షలకు సిద్ధం చేయనుంది. ఈమేరకు పరీక్షల నిర్వహణకు ఈటీఎస్‌తో ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలను నెలకొల్పనుంది.

ఇందులో ఒకటి ప్రత్యేకంగా బాలికల కోసమే కాగా మరొకటి కో–ఎడ్యుకేషన్‌ విధానంలో ఏర్పాటు కానుంది. ఈనెల 12న జగనన్న విద్యాకానుక (జేవీకే)తోపాటు 28వతేదీ నుంచి వారం రోజుల పాటు ‘అమ్మఒడి’ కార్యక్రమాల ద్వారా చదువుల ఆవశ్యకతను చాటి చెప్పాలని నిర్ణయించింది.

పాఠశాలల్లో అమలయ్యే కార్యకలాపాల సమగ్ర పర్యవేక్షణకు ప్రతి రెవెన్యూ డివిజనల్‌లో ఒక డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ అధికారిని నియమించనుంది. ఈమేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాల’ పేరుతో జూన్‌ 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా, 20న రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.  

3 కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2,118 పోస్టులు 
వచ్చే ఏడాది మరో మూడు కొత్త మెడికల్‌ కాలేజీలు (పులివెందుల, పాడేరు, ఆదోని) ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో కాలేజీకి 706 పోస్టుల చొప్పున 2,118 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదించింది. రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో ఈ ఏడాదే తరగతులు ప్రారంభమవుతున్నాయి.

6 నుంచి 9 నెలల వ్యవధిలో అత్యంత వేగంగా పనులు చేపట్టి ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చింది. 2019తో పోలిస్తే పీజీ సీట్ల సంఖ్య కూడా రెట్టింపైంది. ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిల్లో 41 మంది స్పెషాల్టీ, సూపర్‌ స్పెషాల్టీ  వైద్యులను రెగ్యులర్‌ పద్ధతిలో నియమించేందుకు కేబినెట్‌ ఆమోదించింది. ఉద్దానం ఆస్పత్రిని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దనున్నాం. 

పాఠశాల స్థాయి నుంచే ‘టోఫెల్‌’ 
విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్స్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా టోఫెల్‌ పరీక్ష కోసం సన్నద్ధం చేయనుంది. ఈ పరీక్షల నిర్వహణకు ఈటీఎస్‌తో ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. టోఫెల్‌ ప్రైమరీ (3–5 తరగతులు), టోఫెల్‌ జూనియర్‌ (6–10  తరగతులు) పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్‌ అందచేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్‌ టీచర్‌ను ప్రభుత్వం 3 రోజుల శిక్షణ కోసం అమెరికాకు పంపిస్తుంది.  

డెయిరీలను నాశనం చేసిన చంద్రబాబు 
మాజీ సీఎం చంద్రబాబు స్వప్రయోజనాల కోసం సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారని మంత్రి వేణు మండిపడ్డారు. హెరిటేజ్‌ కోసం చిత్తూరు డె యిరీ మూసి వేశారన్నారు. సీఎం జగన్‌ పాడి రైతు ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమూల్‌ ద్వారా మే లైన సేకరణ ధర లభించేలా చర్యలు చేపట్టారన్నా రు. ఏపీలో పాలఉత్పత్తి పెరిగిందన్నారు. పాడిరైతును ఆర్థికంగా బలోపేతం చేయ డమే లక్ష్యంగా 28.35 ఎకరాల చిత్తూరు డైరీ భూ ములను అమూల్‌కు 99 ఏళ్లు లీజుకు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. తద్వారా చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలన్న పాడిరైతుల కల నెరవేరుతుందన్నారు.   

ఆమోదించిన ఇతర ప్రతిపాదనలు.. 
► రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ అర్చకులు, ధర్మకర్తలకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఐదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. దేవదాయ శాఖ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆక్రమణలు తొలగించేందుకు వీలుగా చట్ట సవరణ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం. 

► చిత్తూరు జిల్లా సొదుంలో బీసీ బాలికల గురుకుల కళాశాలలో రెండు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస బీసీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. 

► నాడు–నేడు పనులు పూర్తైన 476 జూనియర్‌ కాలేజీల్లో వాచ్‌మెన్ల నియామకం. 

► ఆధార్‌ గుర్తింపు కార్డు చట్టబద్ధత ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. 

► 2017 బధిరులు ఒలింపిక్స్‌ టెన్నిస్‌ మిక్స్‌ డ్‌ డ బుల్స్‌లో కాంస్య పతక విజేత, ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ కెప్టెన్‌ షేక్‌ జాఫ్రిన్‌ (కర్నూలు జిల్లా)ను సహకారశాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్‌–1 సర్వీసులో నియమిస్తూ జోన్‌ –4లో సూపర్‌ న్యూమరరీ పోస్టు మంజూరుకు ఆమోదం. 

► నరసాపురం ఫిషరీస్‌ యూనివర్సిటీలో 65 పోస్టులు, ఫిషరీస్‌ సైన్స్‌ కాలేజీలో 75 పోస్టులు మంజూరు.  విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో నూతనంగా అడోల్‌సెంట్‌ అండ్‌ చైల్డ్‌ సైకియాట్రి డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు చైల్డ్‌ సైకియాట్రి సూపర్‌ స్పెషాలిటీ యూనిట్‌లో 11 పోస్టులు, కడప మానసిక వైద్యశాలలో కొత్తగా 116 పోస్టులు మంజూరు. 

► రాజానగరం అసెంబ్లీ పరిధిలో సీతానగరం పీహెచ్‌సీ ఇక సీహెచ్‌సీగా మార్పు. 

► శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్‌ఎం పురం, చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణం, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి,  రాజమ హేంద్రవరంలో ఏర్పాటు కానున్న నాలుగు ఐఆర్‌ బెటాలియన్లలో ఒక్కో చోట 980 చొప్పున మొత్తం 3,920 పోస్టుల మంజూరు. 

► గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా పాలసీకి కేబినెట్‌ ఆమోదం. ఏడాదికి 0.5 మిలియన్‌  టన్నుల హైడ్రోజన్, 2 మిలియన్‌ టన్నుల అమ్మోనియాను వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి చేయడం లక్ష్యం.ఈ పరిశ్రమల స్థాపనతో దాదాపు 12 వేల ఉద్యోగాల కల్పన 

► అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రూ.1800 కోట్లతో 300 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న రెన్యూ వోయేమాన్‌ పవర్‌ కంపెనీకి గ్రీన్‌ సిగ్నల్‌ 

► ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ సెక్షన్‌ 5 (రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి విలీనం చేస్తూ ) సవరణ ప్రతిపాదనకు ఆమోదం. 

► గుంటూరు జిల్లా తాడేపల్లిలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) ఏర్పాటుకు 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. 

► వైఎస్సార్‌ జిల్లా సీ.కె.దిన్నె మండలం మామిళ్లపల్లెలో 3.70 ఎకరాలు, కడప మండలం చిన్నచౌక్‌లో 3.70 ఎకరాల ప్రభుత్వ భూమి కడప జిల్లా బెస్త సంఘానికి కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం. అనంతపురం జిల్లా పాలసముద్రంలో గతంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కొటిక్స్‌ సంస్థకు కేటాయించిన 10 ఎకరాల భూమి అదే ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయకు కేటాయింపు. 

► నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో 40 సెంట్లు, రావూరులోని 9.46 ఎకరాల ప్రభు త్వ స్థలాన్ని ఏపీ మారిటైం బోర్డుకు రామాయపట్నం నాన్‌ మేజర్‌ పోర్టు కోసం బదలాయింపు.  

► ఏర్పేడు మండలం వికృతిమాలలో 15.15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వామి నారాయణ్‌ గురుకుల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు కేటాయింపు. 

► డిజిటల్‌ లైబ్రరీలు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు, పీహెచ్‌సీలకు హైబ్యాండ్‌ విడ్త్‌తో 5జీ సేవలు అందించేందుకు వీలుగా ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ రూ.445.7 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్‌ ఆమోదం. 

► ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీ ప్రభుత్వం చూపిన చొరవను అభినందించిన  కేంద్ర ఆరోగ్య శాఖ, ఒడిశా ప్రభుత్వం. సీఎం జగన్‌ సూచనలతో 50 అంబులెన్సుల తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలను హర్షిస్తూ ఆమోదించిన మంత్రివర్గం.  a

మరిన్ని వార్తలు