సౌర వెలుగులు.!

15 Apr, 2022 22:55 IST|Sakshi
మదనపల్లి ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ పలకలు

మదనపల్లెలో సౌర విద్యుత్‌పై ప్రభుత్వ శాఖల దృష్టి 

ఆర్టీసీ, జిల్లా పరిషత్తు పాఠశాలలో అమలు 

భారీగా తగ్గిన విద్యుత్‌ బిల్లులు 

మదనపల్లె సిటీ: రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సౌరవిద్యుత్‌పై దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్‌ను వినియోగించేలా అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె ఆర్టీసీ –1, 2 డిపోలు, గ్యారేజీలు, బస్‌స్టేషన్, జెడ్పీహైస్కూల్‌ ప్రాంగణాల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వీటిద్వారా వస్తున్న విద్యుత్‌ను ఆ సంస్థలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ నెలనెలా వస్తున్న కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందాయి. మదనపల్లెలో సౌర వెలుగులపై ప్రత్యేక కథనం.  

మదనపల్లె ఆర్టీసీ డిపోలు..  
తన ఆస్తులను మరింత సమర్థవంతంగా సద్వి నియోగం చేసుకునే వ్యూహంలో భాగంగాఆర్టీసీ సౌర విద్యుత్‌ బాట పట్టింది. బస్‌ స్టేషన్, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పారు.  పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు డిపోలను ఎంపిక చేశారు. అందులో భాగంగా 2018లో మదనపల్లె ఆర్టీసీ డిపోలో సోలార్‌ ప్లాంటును ఏర్పాటు చేశారు. 100 కిలో వాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.37 లక్షల వరకు వెచ్చించారు. ప్లాంటు ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది.

సుమిత్‌ సంస్థ టెండర్‌ ద్వారా ఆర్టీసీకి 25 ఏళ్లపాటు తక్కువ ధరకు విద్యుత్‌ సరఫరా చేస్తోంది. వీటి ద్వారా బస్‌స్టేషన్, రెండు డిపో కార్యాలయాలు, గ్యారేజీలో సోలార్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. 1, 2 డిపో కార్యాలయాలపై 326 పలకలను ఏర్పా టు చేశారు. గతంలో విద్యుత్‌ బిల్లు నెలకు రూ.1.50 లక్ష వరకు వచ్చేది. సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేసిన తరువాత నెలకు సరాసరి రూ.40–50 వేలు బిల్లు వస్తోంది. సగటున నెలకు రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. గత 5 సంత్సరాలుగా సోలార్‌ ప్లాంటు విజయవంతంగా నడుస్తోంది.  

ఇతర డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు 
మదనపల్లె ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్లాంటు సక్సెస్‌ కావడంతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. త్వరలో అన్ని డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు.   

పూర్వ విద్యార్థి సహకారం.. జెడ్పీ పాఠశాలకు వరం 
పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన రవిసుబ్రమణ్యం ఖతర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన చిన్నప్పుడు మదనపల్లెలో చదువుకున్నాడు. ఆయనకు విద్యబోధించిన ఉపాధ్యాయుడు ఫణీంద్ర ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గత ఏడాది మదనపల్లెకు వచ్చినప్పుడు తన గురువును కలిసి సన్మానం చేయాలనుకున్నాడు. దీనికి ఉపాధ్యాయుడు నిరాకరించి పాఠశాలలో సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరాడు.

ఆయన అభ్యర్థన మేరకు రూ.4.50 లక్షల వ్యయంతో సోలార్‌ ప్లాంట్‌ను గత ఏడాది మార్చి  నెలలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ 60 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా 50 సోలార్‌ పలకలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ను పాఠశాలలోని 55 గదుల్లో ఫ్యాన్లు, లైట్లకు వినియోగించేలా వైరింగ్‌ చేశారు. పాఠశాల ఆవరణంలో తాగునీటి కోసం బోరు కూడా వినియోగిస్తున్నారు. గతంలో నెలకు రూ. 15 వేలు నుంచి 18 వేలు వరకు వచ్చే బిల్లు ప్రస్తుతం రూ.2 వేలు లోపే వస్తోంది. పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయం, కార్యాలయంతో పాటు అవసరం ఉన్నచోట్ల సౌర విద్యుత్‌నే వినియోగిస్తున్నారు.  

సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం 
సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికల్లో భాగంగా మదనపల్లె డిపోలోని బస్‌స్టేషన్‌పై సోలార్‌ విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆర్టీసీకి నెలకు రూ. లక్ష వరకు ఆదా అవుతోంది.  
–వెంకటరమణారెడ్డి, వన్‌ డిపో మేనేజర్‌.మదనపల్లె

దాతలు ముందుకు రావాలి 
మా పాఠశాలలో 2,138 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఖతర్‌లో పని చేసే రవిసుబ్రమణ్యం సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేయడం అభినందనీయం. దాతలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది.      
–రెడ్డె్డన్నశెట్టి, హెచ్‌ఎం, జెడ్పీ ఉన్నత పాఠశాల, మదనపల్లె   

మరిన్ని వార్తలు