రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.. టమాటా ధరలకు కళ్లెం

20 May, 2022 04:12 IST|Sakshi

ప్రభుత్వాదేశాలతో రంగంలోకి దిగిన మార్కెటింగ్‌ శాఖ 

కృత్రిమ కొరత.. అధిక ధరల విక్రయాలకు చెక్‌ 

రైతుల నుంచి నేరుగా కొనుగోలు.. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి 

నేటి నుంచి రైతు బజార్లలో సరసమైన ధరలకు విక్రయాలు  

సాక్షి, అమరావతి: టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి శుక్రవారం నుంచి రైతుబజార్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లుచేసింది. బహిరంగ మార్కెట్‌లో టమాటా ధర ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.81 వరకు పలుకుతోంది. స్థానికంగాను, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

వీటిని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కింద స్థానిక రైతుల వద్ద ఉన్న టమాటా నిల్వలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దిగుమతులు చేసుకోవాలని సంకల్పించింది. బహిరంగ మార్కెట్‌ ధరల కంటే కనీసం కిలోకి రూ.10లు తక్కువగా రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే షోలాపూర్‌ నుంచి దిగుమతి చేసుకున్న 20 టన్నుల టమాటాలను గుంటూరు, ఏలూరు రైతుబజార్ల ద్వారా శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.

తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మరో 40 టన్నుల దిగుమతికి ఏర్పాట్లుచేసింది. వీటిని ఉత్తరాంధ్రతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా విక్రయించనుంది. ఇదే రీతిలో బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతగా తీసుకుని అక్కడ రైతుబజార్ల ద్వారా కిలో రూ.60కు మించకుండా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మరోవైపు.. మదనపల్లి, ఇతర ప్రధాన టమాటా మార్కెట్లలో జోక్యం చేసుకుని రైతుల నుంచి పెద్దఎత్తున కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లుచేసింది. ఈ చర్యలతో నాలుగైదు రోజుల్లో వీటి ధరలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తాం 
బహిరంగ మార్కెట్లలో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా పక్క రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా రైతుల వద్ద ఉన్న నిల్వలను కూడా మార్కెట్‌లో జోక్యం చేసుకుని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లుచేశాం. ఇందుకోసం వ్యవసాయ, మార్కెటింగ్, రైతుబజార్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశాం. వీటిని ప్రాధాన్యతా క్రమంలో రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతాం. సాధ్యమైనంత త్వరగా ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
– కాకాణి గోవర్థన్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి 

మరిన్ని వార్తలు