వైద్య సేవల్లో లోపాలుంటే 104కు చెప్పండి

13 May, 2022 04:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఫిర్యాదులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం

వైద్యులు, మందులు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్యశ్రీ సేవల్లో అలసత్వం ఉంటే చెప్పాలి

ఫిర్యాదులపై వెంటనే చర్యలు 

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి సమయంలో ఆపద్బాంధవిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన 104 కాల్‌ సెంటర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సేవను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఎదురయ్యే సమస్యలపై ఈ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసే వీలును కల్పించబోతోంది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రచిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిరుపేద, మధ్యతరగతి రోగులు చికిత్స అనంతరం సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలనే సంకల్పంతో సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నారు.

ఈ కార్యక్రమానికి రూ.16వేల కోట్లకు పైగా భారీ నిధులను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్యసిబ్బంది కొరతకు తావులేకుండా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్య శాఖలో 39వేల పోస్టుల భర్తీ చేపట్టింది. అవసరమైన మౌలిక వసతులనూ సమకూరుస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ ఇటీవల  పలు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు ఇబ్బందులకు గురైన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో రోగులకు ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో 104 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

కరోనా రోజుల్లో 12లక్షల మందికి సేవలు
కరోనా కష్టకాలంలో 104 కాల్‌ సెంటర్‌ ద్వారా కోవిడ్‌కు సంబంధించిన సమాచారం, వైద్య పరీక్షలు, ఇతర సేవలన్నింటినీ ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రజలకు అందించారు. 12 లక్షల మందికి పైగా ప్రజలు కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేసి కరోనా మూడు దశల్లో సేవలు పొందారు. ఫోన్‌చేస్తే కరోనా నిర్ధారణ పరీక్షలకు టోకెన్‌ రైజ్‌ చేయడం మొదలు, పాజిటివ్‌ అయితే ఆసుపత్రికి తరలించే అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం, ఆసుపత్రిలో బెడ్‌ను సమకూర్చడం ఇలా అనేక రకాల సేవలు కాల్‌ సెంటర్‌ ద్వారా అందాయి.

వారం రోజుల్లో బలోపేతం 
ప్రభుత్వాస్పత్రుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా 104 కాల్‌ సెంటర్‌ను వారం రోజుల్లో బలోపేతం చేస్తాం. వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం.. సెక్యూరిటీ, శానిటేషన్, మహాప్రస్థానం, అంబులెన్స్‌ సహా ఇతర సేవల్లో ఇబ్బందులు ఎదురైతే రోగులు ఫిర్యాదు చేయడానికి వీలు కల్పిస్తాం. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతాం. రోగులు ఏ చిన్న ఇబ్బందికీ గురికాకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటాం. 
– ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి   

మరిన్ని వార్తలు