గ్రామకంఠం భూములకు యాజమాన్య హక్కు పత్రాలు

24 May, 2022 04:59 IST|Sakshi

విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం

రీసర్వేలో ప్రతి గ్రామంలో గ్రామకంఠం భూహక్కు రిజిస్టర్లు

వాటి ఆధారంగా యాజమాన్య హక్కు

సాక్షి, అమరావతి: గ్రామకంఠం భూములకు యాజమాన్యహక్కు పత్రాలు జారీచేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. రీసర్వే తర్వాత గ్రామకంఠం భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తేలాక గ్రామకంఠం భూహక్కు రిజిస్టర్, వ్యక్తిగత గ్రామకంఠం భూహక్కు రిజిస్టర్‌ తయారు చేసి వాటి ప్రకారం భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఏపీ రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (గ్రామకంఠం భూముల యాజమాన్యహక్కు పత్రాలు)రూల్స్‌–2022 పేరుతో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ సోమవారం తుది నోటిఫికేషన్‌ జారీచేశారు. గతేడాది జూన్‌లో దీనికి సంబంధించి 1971 ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. తాజా నోటిఫికేషన్‌ ద్వారా దాని అమలుకు విధివిధానాలు జారీచేసింది. వీటి ప్రకారం రీసర్వే తర్వాత గ్రామాల్లోని గ్రామకంఠం భూములకు తహశీల్దార్లు భూయాజమాన్యహక్కు పత్రాలు జారీచేస్తారు. 

ఇప్పటివరకు అనుభవ హక్కే..
ఇప్పటివరకు గ్రామకంఠం భూములున్న వారికి వాటిని అనుభవించడం తప్ప వాటిపై హక్కు లేదు. తాతలు, తండ్రుల నుంచి వచ్చినా హక్కు పత్రాలు లేకపోవడం వల్ల వారికి వాటిపై ఎలాంటి రుణాలు వచ్చేవి కావు. అమ్ముకునేందుకు హక్కు ఉండేది కాదు. 2006లో వాటిని ప్రైవేటు భూములుగా పరిగణించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా వాటిని నిషేధిత భూముల జాబితాలోనే కొనసాగించారు.

తాజాగా ఇటీవలే గ్రామకంఠాలను ప్రైవేటు భూములని స్పష్టం చేసి నిషేధిత భూముల జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రస్తుతం భూముల రీసర్వే జరుగుతుండడంతో గ్రామకంఠంలోని భూములను కొలుస్తున్నారు. సర్వే తర్వాత ఆ భూముల్లో ఎవరు ఉన్నారో నిర్థారించి వారికి భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వనున్నారు. అప్పటి నుంచి వాటిపై రుణాలు తెచ్చుకోవడంతోపాటు వారికి అమ్ముకునేందుకు, ఇతర హక్కులు వస్తాయి. 

రికార్డింగ్‌ అథారిటీ.. 
భూ యాజమాన్యహక్కు పత్రాలు ఎలా ఇవ్వాలి, విచారణ ఎలా చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇవ్వాలి, ఎన్నాళ్లకు గ్రామసభ పెట్టాలనే అంశాలపై నోటిఫికేషన్‌లో మార్గదర్శకాలు ఇచ్చారు. రీసర్వేలో గ్రామకంఠం ముసాయిదా భూహక్కు రిజిస్టర్‌ను తయారు చేస్తారు. దాని ఆధారంగా ఆర్‌వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) తయారవుతుంది. ఆ తర్వాత గ్రామంలో అందరికీ నోటీసులిచ్చి గ్రామసభ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఆయా గ్రామాలకు రికార్డింగ్‌ అథారిటీని నియమిస్తారు.

ఆ అధికారి గ్రామకంఠం స్థలాలపై గ్రామసభలో విచారణ చేసి అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తారు. వాటి ప్రకారం రికార్డు తయారు చేసి ఇస్తారు. వాటి ఆధారంగా తహశీల్దార్‌ ఆయా గ్రామాల్లో మళ్లీ గ్రామసభలు పెట్టి భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇస్తారు. వీటికోసం కార్యాలయాల చుట్టూ తిరక్కుండా మీ సేవ కేంద్రాల ద్వారా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గ్రామకంఠం భూములకు భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వడం చరిత్రలో ఇదే ప్రథమం. దీనివల్ల అనేక భూ సమస్యలు పరిష్కారమవుతాయి.   

మరిన్ని వార్తలు