‘అన్నమయ్య’ పునర్నిర్మాణం.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

2 Nov, 2022 02:55 IST|Sakshi

రూ.787 కోట్లతో చేపట్టే ప్రతిపాదనకు సీఎం జగన్‌ ఆమోదం

చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద దాటినా తట్టుకునేలా

మట్టికట్ట కాకుండా 440 మీటర్ల పొడవుతో కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మించాలన్న నిపుణుల కమిటీ 

హైడ్రాలిక్‌ సిలిండర్‌ హాయిస్ట్‌ విధానంలో నిర్వహించేలా గేట్లు 

అదనపు స్పిల్‌వే నిర్మించాలన్న డ్యామ్‌ సేఫ్టీ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసిన టీడీపీ సర్కార్‌

ఫలితంగా ఆకస్మిక వరదలకు తెగిన అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట

సాక్షి, అమరావతి: ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలతో గతేడాది నవంబర్‌ 19న తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.787 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పునర్నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈమేరకు పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.

చెయ్యేరుకు వందేళ్లలో ఒకసారి గరిష్టంగా 2.40 లక్షల క్యూసెక్కులు, 200 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేయగా 140 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో గతేడాది అన్నమయ్య ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.

ఈ నేపథ్యంలో చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వే నిర్మించాలన్న సీఎం జగన్‌ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు అన్నమయ్య ప్రాజెక్టును రీ డిజైన్‌ చేశారు.
 
నాడు.. అదనపు స్పిల్‌వే నిర్మించకపోవడంతోనే
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించగా 2001కి పూర్తి చేశారు. 206.65 మీటర్ల ఎత్తుతో 94 మీటర్ల పొడవున స్పిల్‌వే, అనుబంధంగా 336 మీటర్ల పొడవున మట్టికట్టను నిర్మించారు. స్పిల్‌వేకు 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో ఐదు గేట్లు అమర్చారు. ఈ ప్రాజెక్టు కింద 22,500 ఎకరాల ఆయకట్టు ఉంది.

2012లో జల వనరుల శాఖ 3–డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గరిష్టంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయవచ్చని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్‌ సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్‌వే నిర్మించాలని ఇచ్చిన నివేదికను టీడీపీ సర్కారు పట్టించుకోలేదు.

గతేడాది నవంబర్‌ 16, 17, 18, 19వతేదీల్లో శేషాచలం– నల్లమల అడవులు, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా అధికారులు దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8 గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు.

ఆ రోజు రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తేసి 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19న అర్థరాత్రి 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కులు రావటంతో మట్టం గరిష్ట స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దీంతో 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది.

440 మీటర్ల పొడవు.. 4 లక్షల క్యూసెక్కులు దాటినా
చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువగా వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా దృఢంగా అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ క్రమంలో మట్టికట్ట కాకుండా 440 మీటర్ల పొడవున కాంక్రీట్‌ కట్టడం (స్పిల్‌వే)తో ప్రాజెక్టును నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించింది.

నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా దిగువకు విడుదల చేసేలా గేట్లను సులభంగా నిర్వహించేందుకు హైడ్రాలిక్‌ సిలిండర్‌ హాయిస్ట్‌ విధానంలో పనులు చేపట్టాలని నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.787 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.    

మరిన్ని వార్తలు