పేదల గూటికి టీడీపీ గండి!

20 Feb, 2021 05:47 IST|Sakshi

ఇళ్ల స్థలాలపై న్యాయ స్థానాలకు వెళ్లిన టీడీపీ నేతలు

55 వేల మందికి ఆగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

పట్టాలు పంపిణీ కాకపోవడంతో మొదలవ్వని ఇళ్ల నిర్మాణం

వారం పది రోజుల్లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం

మరింత జాప్యం అయితే రెండో దశలో పంపిణీ చేయాలని సూచన 

సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు దేశ, రాష్ట్ర చరిత్రలో వేలాది ఎకరాల భూమిని పారిశ్రామిక వేత్తలకు కేటాయించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి గానీ, గూడు లేని పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన దాఖలాలు లేవు. అలాంటిది తొలి సారిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్లు లేని పేదలందరికీ సంతృప్త స్థాయిలో ఏకంగా 62 వేల ఎకరాల భూమిని 30.60 లక్షల మందికి పంపిణీ చేశారు. తొలి దశలో 15.60 లక్షల మంది పేదలకు ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తొలి దశలో 55,230 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు జరగకుండా తాత్కాలికంగా గండి కొట్టింది.

వివిధ సాకులతో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కాకుండా ఆ పార్టీ పెద్దల సూచనలతో కొందరు నేతలు న్యాయ స్థానాలను ఆశ్రయించారు. దీంతో తొలి దశలో తొమ్మిది జిల్లాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 55,230 పేదల ఇళ్ల నిర్మాణాల మంజూరు నిలిచిపోయింది. టీడీపీ నేతలు తాత్కాలికంగా పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారే తప్ప శాశ్వతంగా అడ్డుకోలేరని, న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించి.. అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారుల మనసులో అలజడి ఏర్పడకుండా వారికి భరోసా కల్పించేలా కేసులు పరిష్కారం కాగానే ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణాలు చేపడతామని సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు లేఖలు రాశారు.  

పక్షం రోజుల్లో వివాదాల పరిష్కారానికి చర్యలు  
న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వని కారణంగా తొలి దశ ఇళ్ల నిర్మాణాల మంజూరు పత్రాలను 55,230 మంది పేదలకు ఇవ్వలేకపోయామని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు. వారం పది రోజుల్లోగా న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా న్యాయ స్థానాల్లో కేసుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకా ఎక్కువ రోజులు జాప్యం అయితే రెండో దశ ఇళ్ల నిర్మాణాల్లో తొలి దశలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు