AP Pharmacy App: ‘పాజిటివ్‌’లను పట్టేస్తున్న ఫార్మా యాప్‌! 

16 Feb, 2022 05:22 IST|Sakshi

అన్ని మెడికల్‌ షాపుల్లో ఆ యాప్‌ డౌన్‌లోడ్‌

కరోనా లక్షణాలతో మందులు కొనేవారి వివరాల నమోదు

వాటి ఆధారంగా వలంటీర్, ఆశా, ఏఎన్‌ఎంల ఆరా  

అవసరమైన వారికి వైద్య పరీక్షలు

ఆ విధంగా ఇప్పటి వరకూ 4,534 పాజిటివ్‌ కేసుల గుర్తింపు  

కరోనా నియంత్రణలో ఇలా యాప్‌ ద్వారా సత్ఫలితాలు 

కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవిడ్‌–19 ఫార్మసీ యాప్‌ సత్ఫలితాలనిచ్చింది. 2020లో తొలి దశ వైరస్‌ వ్యాప్తి సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఈ యాప్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇది 4,534 పాజిటివ్‌ కేసులను పసిగట్టింది.

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి ప్రారంభంలో కొందరు అనుమానిత లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకుండా మెడికల్‌ షాపుల్లో మందులు కొని సొంత వైద్యం చేసుకునే వారు. దీంతో ఇతర కుటుంబ సభ్యులకు వైరస్‌ వ్యాప్తి చెందడంతో పాటు, సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాల మీదికొచ్చేది. ఇలాంటి పరిస్థితులకు చెక్‌ పెట్టడం కోసం ప్రభుత్వం ఫార్మా యాప్‌ను ప్రవేశపెట్టింది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా అనుమానిత సమస్యలకు మందులు కొనుగోలు చేస్తున్న వారి వివరాలు.. పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ వంటివి యాప్‌లో నమోదు చేయాలని మెడికల్‌ షాపులకు ఔషధ నియంత్రణ శాఖ ఆదేశాలిచ్చింది. ఇలా నమోదు చేసిన సమాచారం ఆధారంగా స్థానిక వలంటీర్, ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌తో పాటు ఇతర సిబ్బంది స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తారు. సాధారణ సమస్యగా భావిస్తే తగిన జాగ్రత్తలు సూచిస్తారు. కరోనాగా అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి పరీక్షలు చేయిస్తారు. 

మొత్తం 10.94 లక్షల పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా 12,391 మెడికల్‌ షాపులు ఫార్మా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాయి. గడిచిన వారం రోజుల్లో కరోనా అనుమానిత లక్షణాలకు మందులు కొనుగోలు చేసిన 47,666 మంది వివరాలను రాష్ట్ర వ్యాప్తంగా యాప్‌లో నమోదు చేశారు. ఇలా తొలి దశ నుంచి ఇప్పటి వరకూ 19,83,767 మంది వివరాలను నమోదు చేశారు. ఆ వివరాల ఆధారంగా ఫోన్‌లో మాట్లాడటం, నేరుగా ఇళ్లకు వెళ్లి పరిశీలించడం ద్వారా అందరి ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్య సిబ్బంది ఆరా తీశారు.

10,94,942 మందికి వైద్య పరీక్షలు అవసరమని గుర్తించి, నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా, 4,534 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ప్రెగ్నెన్సీ కిట్ల తరహాలో ఇంట్లోనే కరోనా నిర్ధారణ చేసుకునే కిట్లు మార్కెట్‌లోకొచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 35,174 కిట్లను కొనుగోలు చేశారు. వీరి వివరాలను ఫార్మా యాప్‌లో నమోదు చేయడంతో ఆరోగ్య సిబ్బంది వారి ఆరోగ్యంపై వాకబు చేశారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 4,791, అనంతపురంలో 4,216, విశాఖపట్నంలో 4,133 మంది కిట్లు కొనుగోలు చేశారు.   

మరిన్ని వార్తలు