మళ్లించిన వరద నీటినీ  కోటాలో కలిపేస్తారా?

5 May, 2022 03:09 IST|Sakshi

కృష్ణా బోర్డు తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం

విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి వరద నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే

వరద నీటి మళ్లింపును విపత్తు నివారణ చర్యగా పరిగణించాలేగానీ కోటా కింద లెక్కించకూడదని స్పష్టీకరణ

సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ కూడా ఇదే అంశాన్ని స్పష్టంచేసింది

వరద నీటిని కోటా కింద లెక్కిస్తే బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డును ఉల్లంఘించడమే

కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ

సాక్షి, అమరావతి: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలనూ రాష్ట్ర కోటా (నికర జలాలు)లో కృష్ణా బోర్డు కలపడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక కమిటీ కూడా వరద నీటిని ఏ రాష్ట్రం మళ్లించినా.. వాటిని ఆ రాష్ట్ర కోటాలో కలపకూడదని స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేసింది. వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో.. మళ్లించిన వరద నీటిని రాష్ట్ర కోటాలో కలపడమంటే బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డును ఉల్లంఘించడమేనని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూలు, ఆరో పేరా ప్రకారం.. కృష్ణా, గోదావరి వరదలను నియంత్రించడం, విపత్తు నివారణ చర్యలు చేపట్టడం రెండు రాష్ట్రాలపై ఉందని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదికి వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా కడలిలో వరద జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు వరద నీటిని మళ్లించినా.. దాన్ని విపత్తు నివారణ చర్య కింద పరిగణించాలేగానీ కోటా కింద లెక్కించకూడదని పునరుద్ఘాటించారు.

దుర్భిక్ష ప్రాంతాలకు వరద జలాల మళ్లింపు
నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. దీంతో.. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ (పీహెచ్‌ఆర్‌) ద్వారా ఏపీ సర్కార్‌ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది.

కోటా కింద లెక్కించొద్దు : సీడబ్ల్యూసీ కమిటీ
వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును గతంలోనే కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్‌లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. దాంతో ఈ అంశంపై అధ్యయనం చేయడానికి 2020, మార్చి 3న సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ ఏర్పాటుచేసింది. 2020 మేలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ కమిటీ అడిగిన వివరాలన్నీ ఏపీ ఇచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం ఇవ్వలేదు. దీంతో.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించాలా? వద్దా?  అని 2020, అక్టోబర్‌ 7న కృష్ణా బోర్డు కోరింది. దీనిపై సాంకేతిక కమిటీ 2020, అక్టోబర్‌ 20న స్పందిస్తూ.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించకూడదని స్పష్టంచేసింది. 

బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును ఉల్లంఘించినట్లే..
ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29 టీఎంసీలు, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులపాటు వరద ప్రవాహం సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ నివేదిక వచ్చేవరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. దీనిపై ఏపీ సర్కార్‌ అభ్యంతరం వ్యక్తంచేసినా.. వాటిని తోసిపుచ్చింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2021–22లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు