లంక వీడని జనం.. గోదారి ఈదుతున్న యంత్రాంగం

17 Jul, 2022 03:24 IST|Sakshi
కోనసీమ జిల్లా లంక ఆఫ్‌ ఠానేల్లంకలో ఇళ్లను చుట్టేసిన వరదనీరు

గ్రామాలను వీడి రావడానికి ససేమిరా అంటున్న బాధితులు

పడవలపై గోదావరి దాటి లంకలకు అధికార యంత్రాంగం

నిత్యావసరాలు, ఇతర సరుకులు అందిస్తున్న వైనం

గోదావరి గట్టుపై నిరంతరం గస్తీ

వలంటీరు నుంచి మంత్రుల వరకు సహాయక చర్యల్లో తలమునకలు

ఆచంట మండలంలో లంకలను వదిలి గట్టు చేరని జనం

దొడ్డిపట్ల రేవులో మునిగిన ఇళ్ల వద్దే పడవలపై నివాసం

(పశ్చిమ గోదావరి లంక గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధులు ఐ.ఉమామహేశ్వరరావు, వీఎస్‌వీ కృష్ణకిరణ్‌): చుట్టుముట్టిన వరద.. ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడని లంక వాసులు.. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంత బతిమాలినా లంక వీడేదిలేదని మంకుపట్టు. గత్యంతరం లేక ప్రభుత్వ యంత్రాంగామే పడవలతో గోదావరి దాటుకుని లంకల్లోకి వెళ్లి నిత్యావసరాలు అందిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటోంది. లంక వాసుల క్షేమం కోసం గోదావరి గట్టుపై పోలీసులు, ఫైర్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు, గజ ఈతగాళ్లను నియమించింది. వారు కంటి మీద కునుకులేకుండా గస్తీ కాస్తున్నారు.

ప్రజా ప్రతిప్రతినిధులు కూడా వరద నీటిలో గ్రామాలకు వెళ్తున్నారు. శనివారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల్లో పర్యటించి వరద సహాయక చర్యలను సమీక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. వరద బాధితులకు పాలు, గుడ్లు, బ్రెడ్, బిస్కెట్‌ ప్యాకెట్లు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్ర భోజనం, వసతి ఏర్పాట్లు చేసింది.

ఆచంట నియోజకవర్గంలోని పెదమల్లంక, కోడేరు లంక, అయోధ్యలంక, రావి లంక, పుచ్చల లంక, అణగారి లంకల ప్రజలు కొంత మంది మాత్రమే పునరావాస శిబిరాలకు వచ్చారు. ఈ లంకలకు చెందిన మిగతా వారితోపాటు భీమలాపురం, ఏటిగట్టు ప్రాంత వాసులు సైతం గ్రామాలను వీడి వచ్చేందుకు ఇష్ట పడలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగమే పడవలపై లంక గ్రామాలకు వెళ్తోంది.

వారికి బియ్యం, కూరగాయలు, నూనె, కందిపప్పు, మంచినీరు, పాలు, గుడ్లు వంటి నిత్యావసరాలను అందిస్తోంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు నాలుగు రోజులుగా సిద్దాంతం, ఆచంట మండలంలోని లంక ప్రాంతాల్లో బోట్లపై ప్రయాణిస్తూ లంక వాసుల బాగోగులు చూస్తున్నారు. పునరావాస కేంద్రాల్లోని వారికి ఆహారం, లంకల్లో ఉండిపోయిన వారికి సరుకులు అందించేలా సమన్వయం చేస్తున్నారు. ఆయన శనివారం భోజనాలతోపాటు 600 కిలోలకు పైగా చికెన్, 2 వేలకుపైగా గుడ్లను బాధితులకు అందించారు.
ప.గోదావరి జిల్లా లంక గ్రామాల్లోని వారి కోసం నిత్యావసరాలను తరలిస్తున్న దృశ్యం 

పగలంతా పడవలో.. రాత్రయితే పునరావాసంలో..
దొడ్డిపట్ల రేవులో గోదావరి కట్టకు దిగువన 150పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. కట్టకు సమాంతరంగా వరదనీరు ప్రవహిస్తున్నప్పటికీ నీట మునిగిన ఇళ్ల వద్దే వారంతా పడవల్లో ఉంటున్నారు. ఇళ్లలో సామాన్లు దాదాపు 240 పడవల్లో వేసి, వర్షానికి తడవకుండా బరకాలు కప్పి వాటిపైనే పిల్లలు, పెద్దలు ప్రమాదకర స్థితిలో జీవిస్తున్నారు.

పగలు పడవల్లో, రాత్రి పునరవాస కేంద్రాల్లో ఉంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎంత నచ్చచెప్పినా సురక్షిత ప్రాంతాలకు రావడంలేదు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, తదితర సిబ్బంది వారి కోసం గట్టుపై గస్తీ కాస్తున్నారు. దొడ్డిపట్ల రేవు వద్ద గోదావరి గట్టు బలహీనంగా ఉన్న ప్రాంతంలో వరదనీరు గ్రామంలోకి చొచ్చుకుని వస్తుండటంతో యుద్ధ ప్రాతిపదికన గట్టును పటిష్టం చేశారు.

డేంజర్‌ జోన్‌లో నర్సాపురం
గోదావరి నీరు సముద్రంలో కలిసే నర్సాపురానికి వరద తాకిడి ఆందోళనకరంగా మారింది. వరదనీరు నర్సాపురం – పాలకొల్లు ప్రధాన రహదారి పైకి సైతం చేరింది. స్లూయిజ్‌ల నుంచి నీరు వస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముదనూరి ప్రసాదరాజు నాలుగు రోజులుగా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. శనివారం రాత్రి వరదనీరు పట్టణంలోకి  రాకుండా చర్యలు చేపట్టారు. 

అన్నానికి మాత్రమే వెళ్తున్నాను!
గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహించడం మునుపెన్నడూ చూడలేదు. ఏటు గట్టు పక్కనే ఉంటున్న మా ఇల్లు పైకప్పు వరకు మునిగిపోయింది. పది అడుగులు మేర ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామగ్రిని పడవల్లో వేసి తాళ్లతో చెట్లకు కట్టేశాం. భార్య, బిడ్డలను దొడ్డిపట్ల ప్రభుత్వ హైస్కూల్‌లోని సహాయక శిబిరంలో ఉంచి నేను రేయింబవళ్లు పడవలను కాపలా కాస్తున్నాను. ప్రభుత్వం మూడు పూటలా ఆహారం అందిస్తుండటంతో ఆ కాసేపు శిబిరానికి వెళ్లి మళ్లీ పడవల దగ్గరకు వచ్చేస్తున్నా. 
– కొప్పాడి శ్రీను, మత్స్యకారుడు, దొడ్డిపట్ల శివారు, యలమంచిలి మండలం

బడిలో తలదాచుకుంటున్నాం!
మాకు ముంపు అలవాటే. కానీ, ఈ సారి భయపడేంతగా వచ్చింది. కొబ్బరి చెట్టులో సగభాగం నీళ్లలో నానుతోంది. నేను కూలికి  వెళితే, మా ఇంటాయన పడవలో ఇసుక తవ్వగా వచ్చిన డబ్బులతో నాలుగు నూకలు కొనుక్కునే వాళ్లం. వారం రోజులుగా ఏ పనీ లేదు. ఇల్లు వదిలి బడిలో తలదాచుకుంటున్నాం. ప్రభుత్వమే అన్నం పెడుతోంది. అధికారులు రెండు పూటలా మమ్మల్ని చూసి వెళ్తున్నారు. 
– లంకె సత్యవతి, దొడ్డిపట్ల పునరావాస కేంద్రం, యలమంచిలి మండలం

అమ్మ చిరునవ్వు వెనుక..
ఊహకందని ఉప్పెనలో.. ఊహ తెలియని చిన్నారితో.. వీపుపై ఊయల ఊపుతూ.. కష్టమంతా కొట్టుకుపోయినా.. కన్నీళ్లు పెట్టించినా.. ఒడ్డుకొచ్చిన ఊపిరితో..  చిరునవ్వులోనే బాధను దాచుకున్న ఈ మహిళ పేరు సెరి మరియమ్మ. మత్స్యకార కుటుంబానికి చెందిన ఈమె భర్తతో కలిసి దొడ్డిపట్ల ప్రభుత్వ పాఠశాలలోని సహాయక శిబిరంలో తలదాచుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చే పాలతో బిడ్డకు ఉగ్గుపడుతూ.. తానూ ఇంత అన్నం తింటోంది. శనివారం ముంపు లంకల్లో పర్యటించిన సాక్షి బృందానికి కనిపించిన చిత్రమిది.

మరిన్ని వార్తలు