గుండెఘోషకు ‘సూపర్‌’ వైద్యం

27 Feb, 2022 03:24 IST|Sakshi
తిరుపతిలోని పద్మావతి పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఆస్పత్రిలో చిన్నారిని పరీక్షిస్తున్న వైద్యుడు

హృద్రోగ సమస్యలతో పుట్టిన పేద పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం సాంత్వన 

రాష్ట్రంలో తొలిసారిగా తిరుపతిలో పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఆస్పత్రి

తాత్కాలికంగా 70 పడకలతో... ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు

గుండె శస్త్రచికిత్సలతో ఇప్పటికే 128 చిన్నారులకు కొత్త ఊపిరి

అందుబాటులో 14 రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు

మరో 350 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ముందుకొచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం

సాక్షి, అమరావతి: ముద్దులొలికే చిన్నారులు. ఆటపాటలతో బోసినవ్వులు చిందించే వయసు. కానీ, ఆ పసి గుండెల్లో పేరుకున్న విషాదంతో నిత్యం కన్నవారికి కన్నీరే.. ఆందోళనే. పైపెచ్చు పేదరికంతో ఎటూ పాలుపోని నిస్సహాయత. అయితే అమ్మవారి పాదాల సాక్షిగా తిరుపతిలో ప్రారంభమైన పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఆసుపత్రి వీరికి నిజమైన పండగ తీసుకొచ్చింది. ఆరంభమైన 4 నెలల్లో ఏకంగా 128 మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేసి.. ఆ కుటుంబాలకు జీవితానికి సరిపడేంత సంతోషాన్నిచ్చింది.  

ఏపీలోనే మొట్టమొదటిది.. 
నిజానికి రాష్ట్రంలో గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడే పిల్లలకంటూ ప్రత్యేకించి పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఆసుపత్రి వంటిదేమీ లేదు. ఇతర ఆసుపత్రుల్లోనే పిల్లలకూ కార్డియాక్‌ సేవలందిస్తున్నారు. దీంతో ఈ అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి... తిరుపతిని దీనికి వేదికగా చేసుకున్నారు. ఫలితంగా 70 పడకలతో తాత్కాలికంగా శ్రీ పద్మావతి పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఆసుపత్రి ఏర్పాటు కావటం... గతేడాది ఆక్టోబరు 11న ముఖ్యమంత్రి ప్రారంభించటం సాధ్యమయ్యాయి.

నిరుపేదలకు ఖరీదైన, సమర్థమైన వైద్యాన్ని అందించటమే లక్ష్యంగా ముందుకెళుతున్న సర్కారు సాయంతో ఈ 4 నెలల్లో ఆరోగ్య శ్రీ ద్వారా 128 మంది పిల్లలకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు చేయగలిగారు. తాత్కాలికంగా తిరుపతిలోని ‘బర్డ్‌’ ఆస్పత్రి పాత బ్లాక్‌లో పనిచేస్తున్న ఈ ఆస్పత్రికి టీటీడీ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తోంది. అత్యాధునిక పరికరాలతో పాటు 40 ఐసీయూ పడకలు... మూడు లామినార్‌ ఫ్లో ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. వ్యాధిగ్రస్త చిన్నారులు, వారి తల్లిదండ్రులు వేచి ఉండే ప్రాంతంతో పాటు ఔట్‌ పేషెంట్‌ బ్లాక్‌లో ఐదు కన్సల్టేషన్‌ సూట్‌లు ఏర్పాటు చేశారు. ఇంకా పది మంది రెగ్యులర్‌ స్పెషలిస్ట్‌లతో పాటు.. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విజిటింగ్‌ నిపుణులు ప్రతివారం ఇక్కడకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు.   

ఏటా 10 వేల మంది చిన్నారులకు... 
రాష్ట్రంలో ఏటా సుమారు 10 వేల మంది వరకూ చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో పుట్టడమో, పుట్టిన కొద్ది నెలల్లోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవటమో జరుగుతోంది. వీరిలో మూడొంతుల మంది పిల్లలది క్లిష్ట పరిస్థితి. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకమే. మరోవైపు.. రాష్ట్ర విభజన తర్వాత పిల్లల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ఏపీలో ప్రత్యేకంగా ఆస్పత్రి అనేదే లేకుండా పోయింది. దీంతో ఈ తరహా చిన్నారులకు సరైన చికిత్స అందించాలన్న సీఎం ఆలోచనల్లోంచి పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఆసుపత్రి పుట్టుకొచ్చింది.  

350 పడకలతో మరో ‘సూపర్‌ స్పెషాలిటీ’  
తాత్కాలిక ఆసుపత్రి అందిస్తున్న సేవలు మరింత విస్తృతపరచాల్సి ఉన్న తరుణంలో... టీటీడీ 350 పడకలతో మరో సూపర్‌ స్పెషాలిటీ పీడియాట్రిక్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. దీన్లో గుండె సంబంధిత చికిత్సలు మాత్రమే కాకుండా సబ్‌ స్పెషాలిటీలకు సంబంధించి పది ఇతర విభాగాలు ప్రారంభిస్తున్నారు. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఆసుపత్రిలో న్యూరో, జెనిటికల్‌ ఛాలెంజ్డ్, తలసేమియా బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, ఆంకాలజీ, డెవలప్‌మెంటల్‌ పీడియాట్రిక్స్‌ మొదలైన 14 స్పెషాలిటీ సేవలందించేలా ప్రణాళిక రూపొందించారు.  

మరిన్ని వార్తలు