‘బొమ్మ’కు బాసట

15 May, 2022 05:19 IST|Sakshi

కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పునరుజ్జీవం  

ఉపాధి హామీ ద్వారా తెల్లపొని చెట్ల పెంపకం   

అధికారులను ఆదేశించిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌  

బొమ్మల తయారీపై యువతకు శిక్షణ 

సాక్షి ప్రతినిధి విజయవాడ : కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బొమ్మల తయారీకి అవసరమయ్యే కలపనిచ్చే చెట్ల పెంపకానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు అటవీశాఖ అధికారులు, బొమ్మల తయారీదారులతో ఇటీవల సమావేశమై పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. బొమ్మల తయారీకి అవసరమైన కలప గతంలో అందుబాటులో ఉండేదని, ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన వీరులపాడు, ఎ.కొండూరు అటవీ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నట్టు బొమ్మల తయారీదారులు తెలిపారు.

ఈ చెట్లు అంతరించిపోతున్నాయని, బొమ్మలు తయారు చేసే కళాకారుల సంఖ్యా తగ్గిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెట్ల పెంపకానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి, ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తెల్లపొని చెట్లతో కలప బ్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించేలా యువతకు శిక్షణ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు.   

అలా వచ్చి.. ఇలా! 
కొండపల్లి ఖిల్లా రాజభవనాల నిర్మాణంలో డిజైన్‌లు(నక్సే) చేసేందుకు 400 ఏళ్ల కిందట రాజస్థాన్‌ నుంచి వచ్చిన హస్తకళాకారులు.. రాజుల కాలం అంతరించాక బొమ్మల తయారీ పరిశ్రమను జీవనోపాధిగా ఎంచుకుని ఇక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి అడవుల్లో లభించే తెల్లపొని చెట్ల నుంచి లభించే చెక్కతో బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారి శిక్షణలో స్థానికులు సైతం పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బొమ్మల తయారీ, ఉత్పత్తుల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన పరిశ్రమ.. నేడు కలప కొరతతో కొంత నిరాదరణకు గురైంది. గతంలో మొత్తం బొమ్మల పరిశ్రమ కుటుంబాలు 250 ఉండగా.. ప్రస్తుతం 45 కుటుంబాలు మాత్రమే బొమ్మలను తయారు చేస్తున్నాయి.   

మళ్లీ పూర్వ వైభవం దిశగా.. 
డిమాండ్‌ ఉన్న బొమ్మలను మనసుకు హత్తుకునేలా వివిధ ఆకృతుల్లో మలిచి రంగులద్ది.. అమ్మకాలకు ఉంచుతారు. ఎడ్లబండి, కల్లుగీత తాటిచెట్టు, దశావతారాలు, ఏనుగు అంబారీ, ఆవుదూడ, గంగిరెద్దు, అర్జునుడి రథం, తాటిచెట్టు బొమ్మలను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దడంతో పాటు.. దేవతామూర్తుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా తయారు చేస్తారు.

కుటుంబ సభ్యులంతా కలిసి కుటీర పరిశ్రమలా పనిచేసి ఈ బొమ్మలను తయారు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్‌కీబాత్‌లో కొండపల్లి బొమ్మల పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని ప్రస్తావించడం, ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ ప«థకంలో అంతర్జాతీయ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు రాష్ట్ర పరిశ్రమ శాఖ సన్నాహాలు చేస్తుండటంతో కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వవైభవం వస్తుందని బొమ్మల తయారీదారులు ఆశిస్తున్నారు.

మళ్లీ మంచిరోజులు.. 
బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి వన సంరక్షణ సమితులు ద్వారా తెల్లపొని వనాలు పెంచాలి. నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాన్ని కూడా నెలకొల్పితే బాగుంటుంది. ప్రభుత్వం తెల్లపొని కలపను సబ్సిడీపై అందించడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కలెక్టర్‌ తీసుకుంటున్న చొరవతో పరిశ్రమకు మంచిరోజులొస్తాయన్న నమ్మకం ఉంది.     
    – కె.వెంకటాచారి, బొమ్మల కళాకారుడు 

>
మరిన్ని వార్తలు