AP: జగనన్న కాలనీ ఇళ్లకు.. ఉదారంగా రుణాలు

13 Jun, 2022 04:10 IST|Sakshi

వీటిని ‘సిబిల్‌’ నుంచి మినహాయించాలన్న ప్రభుత్వ వినతికి బ్యాంకులు ఓకే

ఇంటి నిర్మాణానికి రూ.35వేల వరకు రుణం.. పావలా వడ్డీకే ఇస్తున్న ప్రభుత్వం

1,19,968 మందికి రుణాలివ్వాలని బ్యాంకుల లక్ష్యం

ఇప్పటివరకు 87,756 మంది దరఖాస్తు చేసుకోగా 64,330 మందికి మంజూరు

సిబిల్‌ స్కోర్‌ మినహాయింపుతో రుణాల మంజూరు ఇక వేగవంతం

సాక్షి, అమరావతి: నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు నిర్మాణానికి ఎటువంటి షరతుల్లేకుండా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ పథకం కింద ఇంటి రుణం తీసుకునే వారికి సిబిల్‌ స్కోర్‌ (రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది) నుంచి కూడా మినహాయిస్తూ రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తాజాగా నిర్ణయం తీసుకుంది.

వైఎస్సార్‌ జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మంది పేదలకు సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ, దీనికి గృహ రుణం మంజూరులో కీలకమైన సిబిల్‌ స్కోర్‌ అడ్డంకిగా మారింది. ఇదే విషయాన్ని గత ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లింది.

ప్రైవేటు బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు జగనన్న కాలనీలకిచ్చే ఇంటి రుణాలను సిబిల్‌ స్కోర్‌ నుంచి మినహాయించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఎస్‌ఎల్‌బీసీ.. ఏపీ టిడ్కో, పీఎంఏవై, వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు ఇచ్చే రుణాలను సిబిల్‌ స్కోర్‌ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీచేసింది. కానీ, అప్పటికే బ్యాంకుకు రుణం ఎగ్గొట్టిన వారికి ఈ మినహాయింపు వర్తించదు.

1.20 లక్షల మందికి లబ్ధి
పేద ప్రజల ఇంటి రుణాలకు సిబిల్‌ స్కోర్‌ నుంచి మినహాయింపు ఇవ్వడంతో 1,19,968 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఏపీ టిడ్కో పథకం కింద 2.62 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉండగా అందులో 300 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఇంటిని ప్రభుత్వం ఒక రూపాయికే అందిస్తోంది. 365, 435 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లకు బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం 1,19,968 ఇళ్లు బ్యాంకుల ఆర్థిక సహాకారంతో నిర్మాణంలో ఉన్నట్లు ఎస్‌ఎల్‌బీసీ అధికారులు వెల్లడించారు.

ఒక్కో ఇంటికి సగటున రూ.2.65 లక్షల చొప్పున మొత్తం రూ.4,107.93 కోట్ల రుణాన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటివరకు 87,756 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 46,330 మందికి రూ.1,389.90 కోట్ల రుణాలను మంజూరయ్యాయి. ఇప్పుడు సిబిల్‌ స్కోర్‌ మినహాయింపు ఇవ్వడంతో రుణ మంజూరు వేగంగా జరుగుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు. మరోవైపు.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.35,000 వరకు పావలా వడ్డీకే రుణం మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు