ఆంజనేయుడికే ఆ భూములు..

3 May, 2022 04:50 IST|Sakshi
పోలీస్, రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఆక్రమణదారులనుంచి భూములను విడిపించి ఆలయ ఈవోకి అప్పగిస్తున్న జిల్లా దేవదాయశాఖ అధికారి

గుంటూరులో 16 ఎకరాల భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించిన ప్రభుత్వం 

వీటి విలువ రూ.120 కోట్లు ఉంటుందని అంచనా

సమస్య పరిష్కారానికి చొరవ చూపని చంద్రబాబు ప్రభుత్వం

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక మంత్రి కోర్టు మూడుసార్లు భేటీ

చివరికి భూమి స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం

పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఆలయ ఈఓకు భూములు అప్పగింత

సాక్షి, అమరావతి: గుంటూరు నగర శివారులో దాదాపు పాతికేళ్లుగా ఆక్రమణదారుల చెరలో ఉన్న రూ.120 కోట్ల విలువచేసే 16 ఎకరాల దేవుడి భూమికి ఎట్టకేలకు మోక్షం సిద్ధించింది. సుదీర్ఘకాలం పాటు నడుస్తున్న ఈ వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలుకుతూ సోమవారం ఆ భూములను ఆలయానికి అప్పగించింది.  గుంటూరు కొరిటపాడు ప్రాంతంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానానికి నగర శివారులోని సర్వేనెం.78లో 17.70 ఎకరాల భూమి ఉంది. అందులో 16 ఎకరాల భూమిపై ఏటా వచ్చే ఆదాయాన్ని జీతభత్యాల కింద వినియోగించుకునేందుకు వీలుగా అర్చకునికి ఆ భూమిని దేవదాయ శాఖ అప్పట్లో ఈనాంగా కేటాయించింది. ఆ తర్వాత.. భూమిని లీజుకు తీసుకున్న కౌలుదారులు తనకు ఏటా లీజు డబ్బులు చెల్లించడంలేదని.. తనకు గుడి నుంచి ప్రతినెలా కొంత మొత్తం జీతం రూపంలోనే చెల్లించాలంటూ సదరు పూజారి ఆ భూమిని 1998లో తిరిగి ఆలయానికే అప్పగించారు. దీంతో ప్రతినెలా జీతం చెల్లించేందుకు దేవదాయశాఖ అంగీకరించింది. అయితే, అప్పటికే ఆ 16 ఎకరాల భూమి ఆక్రమణదారుల చెరలోకి వెళ్లిపోయింది. 2003లో ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించాల్సిన నాటి ప్రభుత్వం.. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కుదిరే వరకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏటా డ్యామేజీ రూపంలో ఆలయానికి చెల్లించాలని ఆక్రమణదారులకు ఆదేశాలిచ్చి సరిపెట్టింది. దీంతో అప్పటినుంచి ఆక్రమణదారులు ఏటా రూ.80 వేలు చెల్లిస్తున్నారు. 

ఆదాయం సరిపోక అప్పుల బాట
విలువైన భూములుండీ ఆ స్వామికి అప్పులు తప్పడంలేదు. ఆక్రమణదారులు ఏటా చెల్లించే రూ.80 వేలే ఆలయానికి ఆదాయం. రెండు లక్షల డిపాజిట్‌పై మరో రూ.పది వేల వడ్డీ వస్తుందని ఆలయ ఈఓ తెలిపారు. పూజారికి అన్నీ కలుపుకుని రూ.12 వేల వేతనం చెల్లిస్తున్నారు. అందులో రూ.5 వేలను ధూపదీప నైవేద్యం కోసం. ఈ నేపథ్యంలో.. పూజారి జీతభత్యం, ఆలయంలో కరెంటు బిల్లులకు ఆదాయం సరిపోక పొరుగున ఉండే కొన్ని ఆలయాల నిధుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయం పేరిట రూ.70 వేల దాకా అప్పు ఉంది. ఇటీవలే ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు రూ.40 వేలను పొరుగు ఆలయం నిధుల నుంచి సర్దుబాటు చేశారు. 

టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం..
ఇక ఆక్రమణలో ఉన్న ఈ ఆలయ భూములను విడిపించేందుకు ఈవో ఎన్నిసార్లు గత టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందనలేదు. దీంతో దేవదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉండే ప్రత్యేక కోర్టులో ఈ భూమి వివాదం పెండింగ్‌లో ఉండిపోయింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఈ భూమి సమస్య పరిష్కరించేందుకు మూడుసార్లు మంత్రి కోర్టు భేటీ అయింది. ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం గుంటూరు జిల్లా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గుంటూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి మహేశ్వరరెడ్డి ఆ భూములను స్వాధీనం చేసుకుని ఆలయ ఈఓకు అప్పగించారు.

అప్పట్లో నా రిపోర్టులకు సమాధానం వచ్చేదికాదు..
గుంటూరు జిల్లా నల్లపాడు గ్రూపు టెంపుల్స్‌లో ఇదీ ఒకటి. వాటన్నింటికీ నేను ఈఓగా ఉన్నాను. 2017 నుంచి ఈ వివాదాస్పద భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో కోర్టు భేటీకి నేను రాసిన రిపోర్టులకు ప్రభుత్వం నుంచి రిప్లయ్‌ వచ్చేది కాదు. రెండున్నర ఏళ్ల క్రితం నేను చేసిన ప్రతిపాదనకు స్పందనగా ప్రత్యేక కోర్టు భేటీని ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించింది.    
     – విజయభాస్కరరెడ్డి, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొరిటపాడు, గుంటూరు  

మరిన్ని వార్తలు